చంద్రబాబు తొలిసారి తొడ కొట్టారు

Update: 2016-01-31 05:34 GMT
మిగిలిన రాజకీయ నాయకులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త భిన్నం. మాస్ ను ఆకర్షించే గుణం ఆయనకు తక్కువే. నిజానికి ముఖానికి చిరునవ్వు కూడా తక్కువే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పుణ్యమా అని.. ఆయన వేసే సెటైర్లకు చేతలతో బదులిచ్చేందుకు నవ్వటం అలవాటు చేసుకున్న చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న సమయంలో చాలానే మారారు. ఎంత మారినా.. మాస్ మహారాజు మాదిరిగా మాత్రం ఆయన ఇప్పటికి మారలేదనే చెప్పాలి.
ఆ లోటును అప్పుడప్పుడు భర్తీ చేస్తున్న చంద్రబాబు.. తాజాగా తొడ కొట్టేశారు. పంచ్ డైలాగులు.. తొడ కొట్టేయటం తెలుగు సినిమాల్లో కామన్. రాజకీయాల్లో కొందరికి మాత్రమే అలవాటైన తొడ కొట్టే విషయంలో బాబు దూరంగా ఉండేవారు. కానీ.. తాజాగా తొడ కొట్టేశారు. కాకుంటే రాజకీయ వేదిక మీద కాకుండా క్రీడా వేదిక మీద ఆయన తొడ కొట్టారు. విశాఖలో షురూ అయిన ప్రో కబడ్డీ లీగ్ మూడో సీజన్ పోటీల్ని ప్రారంభించిన సందర్భంగా బాబు తొడ కొట్టి అక్కడి వారిని అలరించారు.

చిన్నతనంలో కబడ్డీ ఆడిన బాబు.. తాజా పోటీల సందర్భంగా గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చిన్నతనంలో మట్టిలో కబడ్డీ ఆడేవాడినని.. ఇప్పుడు మ్యాట్ మీద ఆడుతున్నారన్న ఆయన.. అప్పటికి ఇప్పటికీ ఆటలో చాలానే మార్పు వచ్చిందన్నారు. ఆటలో తేడా ఏమో కానీ.. తొడ కొట్టి అలరించిన విధానం చూస్తే.. తనలోనూ చాలానే మార్పు వచ్చిందన్న విషయాన్ని బాబు మరోసారి నిరూపించారు.

Tags:    

Similar News