కేసీఆర్‌ కు బాబు శుభాకాంక్ష‌లు... బీజేపీ అస‌హ‌నం

Update: 2018-12-11 09:53 GMT
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. నాలుగేళ్లలోనే రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన గులాబీ దళపతి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్- కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. టీఆర్‌ఎస్ అధినేత- సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డిపై 51,514 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్‌ విజయం సాధించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం శుభాకాంక్షాలు తెలిపారు. ``తెలంగాణలో ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అభినందనలు. ఐదు రాష్ట్రాలలో గెలుపొందిన శాసన సభ్యులు అందరికీ అభినందనలు`` అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ తీరు పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ``దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడింది. గత 5ఏళ్లలో జరిగిన అనేక ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా, ఇప్పుడు తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పూర్తిగా బలహీనపడింది.

బీజేపీ పాలన పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గత 5 ఏళ్లలో బిజెపి చేసిందేమీ లేదనేది అన్నివర్గాల ప్రజలు గుర్తించారు. ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదపడతాయి`` అని వెల్ల‌డించారు.

Tags:    

Similar News