పాక్ మీద దాడేంటి? పీవోకే మాదేగా..?

Update: 2016-09-29 17:33 GMT
మొండోడు రాజు కంటే బలవంతుడని చెబుతారు. మరి.. రాజే మొండోడు అయితే యవ్వరాలు ఇలానే ఉంటాయి. దుష్టబుద్ధితో నిత్యం భారత్ ను ఏదోలా ఇబ్బంది పెట్టాలని తపించే దాయాది పాక్ కు బుద్ధి చెప్పే అసలుసిసలు మొనగాడు వచ్చేశాడనే చెప్పాలి. దశాబ్దాల తరబడి పాక్ తోక కత్తిరించే సరైనోడు రాలేదన్న దేశవాసుల ఆశలకు.. ఆకాంక్షలకు తగ్గట్లుగా ప్రధాని మోడీ తీరు ఉండటం.. ఇప్పటి వరకూ మాటల్లో మాత్రమే ఉండే అంచనాలకు భిన్నంగా తాజాగా చేతల్లో తానేంటో చూపించిన మోడీ తీరు దేశ వాసుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

భారత సైన్యం వీరోచితంగా చేసిన పోరాటంతో పాకిస్థాన్ మైండ్ బ్లాక్ అయిపోతే.. భారత కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తాజాగా తెరపైకి తీసుకొచ్చిన వాదన పాక్ కు కొత్త దిగులు పుట్టించటం ఖాయంగా చెప్పాలి. భారత్ తో పెట్టుకోవటం ఎంత ఖరీదైన వ్యవహారమో పాక్ కు అర్థమయ్యేలా చేస్తున్న మోడీ.. తాజాగా మరో ఆసక్తికర వాదనను తెరపైకి తీసుకొచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చేపట్టిన చర్యను ఆర్మీ చర్యగా చూడకూడదని.. కేవలం ఆత్మరక్షణ కోసం చేసిన దాడులుగా పరిగణించాలంటూ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొనటమేకాదు.. రక్షణ కోసం అవసరమైతే ఆర్మీ ఎన్ని దాడులకైనా సిద్ధమని స్పస్టం చేశారు.  

అంతేకాదు.. తాజాగా చేపట్టిన చర్య ఎంతమాత్రం ఉల్లంఘనలకు పాల్పడింది లేదన్న రాజ్యవర్ధన్.. అసలు పీవోకే భారత్ దే కదా? భారత్ లో అంతర్భాగమైన ప్రాంతంలో లక్షిత దాడుల్ని చేయటంలో తప్పేందంటూ అడుగుతున్న వైనం పాక్ కు మంట పుట్టించటం ఖాయమని చెప్పక తప్పదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రస్తుతానికి పాకిస్థాన్ నియంత్రణలో ఉన్నా.. అధికారికంగా అది భారతభూభాగంలో ఉన్నట్లే లెక్క అని.. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో జరిగే దాడులు.. సరిహద్దుల ఉల్లంఘన.. ప్రాదేశిక ఉల్లంఘన కిందకు రాదని చెప్పటం చూస్తే.. భారత్ తీరు ఏ విధంగా ఉండనుందన్నది కేంద్రమంత్రి చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి. భారత్ నుంచి ఇలాంటి తీరు సరికొత్తగా ఉండటమే కాదు.. పాక్ కు షాకుల మీద షాకులు తగులుతున్నట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News