ఫైర్ బ్రాండ్ ఇంటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లటమా?

Update: 2020-10-28 03:45 GMT
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయటమే కాదు.. రాజకీయ కాకను రగులుస్తోంది. ఇటివల కాలంలో మరెప్పుడూ లేనంత హాట్ హాట్ గా తెలంగాణలో రాజకీయం నడుస్తోంది. టీఆర్ఎస్ లాంటి పార్టీకి అసలుసిసలు ప్రత్యామ్నం తాము తప్పితే మరెవరూ కాదన్న దూకుడును బీజేపీ నేతలు ప్రదర్శిస్తున్నారు. గులాబీ పార్టీకి బలమైన ‘దూకుడు’కు ఏ మాత్రం తీసిపోనంతగా బీజేపీలో కనిపించటమే కాదు.. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు కమలనాథులు.

రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలోపేతం కావటమే కాదు.. టీఆర్ఎస్ కు చెక్ పెట్టటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ ఇంటికి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లటం.. భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.

ఓవైపు బిజీ షెడ్యూల్ లో సైతం.. కేంద్రసహాయ మంత్రిస్థాయిలో ఉన్న నేత.. రాములమ్మ ఇంటికి వెళ్లటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒకప్పుడు సీనియర్ బీజేపీ నేత అలె నరేంద్ర శిష్యురాలిగా విజయశాంతి బీజేపీలో చేరారు. ఇదంతా 1998 నాటి మాట. చాలా స్వల్ప వ్యవధిలోనే మహిళా విభాగానికి కార్యదర్శిగా నియమించారు. 1999లో సోనియాగాంధీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయటంతో విజయశాంతి పేరు జాతీయస్థాయిలో పాపులర్ అయ్యింది. ఆ సమయంలో సోనియా గాంధీ తాను పోటీ చేసే స్థానాన్ని రాయబరేలీగా నిర్ణయించుకోవటంతో.. ఆమె పోటీ చేయలేదు. కొన్నేళ్లు బీజేపీలో ఉన్న ఆమె తర్వాత తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేయటం.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ లోకి తన పార్టీని కలిపేసి.. పార్టీలో చేరారు.

ఎంపీగా గెలుపొందిన ఆమెకు తొలుత గులాబీ పార్టీలో ప్రాధాన్యత లభించినా.. తర్వాత మాత్రం పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆమెను తాజాగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి భేటీ కావటం చూస్తే.. పార్టీ మారేందుకు డిసైడ్ అయినట్లేనని చెబుతున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పార్టీ మారేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సొంతగూటికి మళ్లీ వెళుతున్న రాములమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి పదవులు చేపడతారో చూడాలి.
Tags:    

Similar News