ఆ ఒక్క మాటతో సీట్లు పెంచేయొచ్చట

Update: 2016-07-29 11:30 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత.. రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రత్యర్థి పార్టీల నుంచి నేతల్ని ఆహ్వానించిన సందర్భంగా అవసరానికి మించి మరీ పెద్ద ఎత్తున నేతల్ని తీసుకోవటం తెలిసిందే. ఇంతమంది నేతల్ని పార్టీలోకి తీసుకొస్తున్న నేపథ్యంలో.. రేపొద్దున వారికి పదవులు.. బాధ్యతలు ఎలా అన్న ప్రశ్నకు.. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అన్న మాటను చెప్పటం తెలిసిందే. విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాల్ని పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ అవకాశం ఉండటం.. కేంద్రం ఆమోదం పొందేలా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే తాము తిరుగులేని అధికార కేంద్రాలుగా మారిపోవచ్చని రెండు రాష్ట్రాల్లోని అధికారపక్షాలు భావించాయి.

అయితే.. అసెంబ్లీ నియోకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదని.. ఈ విషయంలో తామేమీ చేయలేమని తేల్చేయటమే కాదు.. రాజ్యాంగంలోని నిబంధనలు మార్పుకు అడ్డుకుంటున్నాయన్న మాటను చెప్పుకొచ్చారు. దీంతో.. అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పలువురు నేతలకు కేంద్రం మాటలు షాకింగ్ గా మారాయి.

కేంద్రం చెప్పినట్లుగా రాజ్యాంగంలోని 170వ అధికారణం పునర్ వ్యవస్థీకరణకు అడ్డు పడుతుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. కేంద్రం తలుచుకోవాలే కానీ.. ఏది అడ్డంకి కాదని చెబుతున్నారు. దీనికి ఏపీ రాష్ట్ర విభజన ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. విభజనకు ముందు రాజ్యాంగంలోని 371(డి) అడ్డుకుంటుందని అందరూ అనుకున్నారని కానీ.. రెండు రాష్ట్రాలకూ ఈ చట్టం వర్తిస్తుందన్న మాటను చేర్చటంతో విభజన వ్యవహారం సింఫుల్ గా పూర్తి అయ్యిందని చెబుతున్నారు.

ఇక.. అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణకు రాజ్యాంగంలోని 170వ అధికారం అడ్డుగా ఉందన్న కేంద్రం మాట కేవలం మోకాలు అడ్డటమే తప్పించి మరింకేమీ కాదని.. ఒకవేళ కేంద్రం కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను పూర్తి చేయాలని బలంగా అనుకుంటే చేసేయొచ్చని.. ఇందుకు రాజ్యాంగంలోని 170వ అధికారణ అడ్డు పడకుండా ఉండేందుకు వీలుగా.. ‘‘నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 170 అధికారం నుంచి మినహాయింపు’’ ఇస్తున్నాం అన్న వ్యాక్యాన్ని చేరిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేసుకోవచ్చని సెలవిస్తున్నారు. ఏ నిబంధన అయినా బంధనంగానే ఉంటుంది. కానీ.. దాని బంధనాలు విప్పే ‘కిటుకు’ ఉన్నా.. కేంద్రానికి ఇష్టమైతే తప్ప అది బయటకు రాదు. ఎవరెంత కోరుకున్నా.. కేంద్రానికి అసెంబ్లీస్థానాలు పెంచాలని లేకపోతే.. ఎన్ని కిటుకులు చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి.
Tags:    

Similar News