ఢిల్లీ సీఎం పేషీలో సీబీఐ హల్ చల్..?

Update: 2015-12-15 06:57 GMT
నిన్నటి వరకూ పరుష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల వైఖరి వివాదాస్పదంగా మారటం తెలిసిందే. ఈ విషయంలో విపక్షాలు ఐక్యంగా వ్యవహరించి మోడీ సర్కారు ఇమేజ్ ను ఎంతలా డ్యామేజ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన మోడీ సర్కారు.. సర్దుకొని.. నేతలిచ్చే స్టేట్ మెంట్ల విషయంలో సంయమనంతో వ్యవహరించాలని.. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న విస్పష్ట హెచ్చరికతో కమలనాథుల నోటికి కాస్త తాళం పడింది.

ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో సీబీఐ అనుసరిస్తున్న తీరు కాస్తంత ఆక్షేపణీయంగానే ఉంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కార్యాలయంపై సీబీఐ దాడులు చేపట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ.. సీబీఐ అధికారులు ఢిల్లీ సీఎంవోను తమ అధీనంలోకి తీసుకొని సోదాలు నిర్వహించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజేంద్రకుమార్ మీద ఆరోపణలు కొత్త కాకున్నా.. సీబీఐ తన లక్ష్మణ రేఖను దాటుతుందన్న విమర్శ తాజా వైఖరిపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం ఉదయం రాజేంద్రకుమార్ కార్యాలయంతో పాటు.. మరో నాలుగు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్యకార్యదర్శి మీద వచ్చిన ఆరోపణలతో సీబీఐ వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా మారింది. సీబీఐ సోదాలు మామూలే అయినా.. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఇలా సోదాలు నిర్వహించటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత దూకుడును సీబీఐ ప్రదర్శిస్తోందన్న విమర్శలు మోడీ హయాంలో పెరిగాయి. ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విషయంలోనూ సీబీఐ ఇలానే వ్యవహరించిన విషయం గమనార్హం.

మూడు.. నాలుగు నెలల (సెప్టెంబర్ చివరి వారంలో) క్రితం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఇంటిపై సీబీఐ దాడులు చేశారు. దారుణమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రికుమార్తె వివాహం కోసం ఇంట్లోని ముఖ్యులంతా పెళ్లి కోసం బయలుదేరి వెళ్లిన తర్వాత ఈ సోదాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇంటిపై సీబీఐ దాడులు జరగటంపై దేశ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమైంది. అవినీతి ఆరోపణల మీద  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లోకి సీబీఐ అధికారులు ప్రవేశించి.. సోదాలు నిర్వహించటం దేశంలో తొలిసారని చెప్పుకొచ్చారు.

నాడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు నిర్వహిస్తే.. తాజాగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సీఎంవోలో ముఖ్య కార్యదర్శి మీద అవినీతి ఆరోపణల పేరుతో సీఎం కార్యాలయంలో సోదాలు చేయటం చూస్తే.. సీబీఐ ఇంత దూకుడుగా ఎందుకు వ్యవహరిస్తుందో ఒక పట్టాన అర్థం కాదు. ప్రధానమంత్రి లేదంటే.. కేంద్రంలోని ముఖ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం సీబీఐకి ఉందా? అన్న ప్రశ్నలోనే సమాధానం కనిపిస్తుందని చెప్పొచ్చు. సీబీఐ సోదాలు నిర్వహించిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీయేతర నేతలు కావటం గమనార్హం.
Tags:    

Similar News