స్ట్రెయిట్, బే, గల్ఫ్.. అసలు వాటికి ఆ పేరు ఎలా వచ్చింది.. హార్మూజ్ దేని కిందకు వస్తుంది..

భూమిని చూసినప్పుడు కొన్ని చోట్ల నీలంగా.. మరికొన్ని చోట్ల సాధారణంగా కనిపిస్తుంది. నీలంగా కనిపించేది నీరు ఉన్న ప్రదేశం అని తెలిసిందే.;

Update: 2026-04-02 08:27 GMT

భూమిని చూసినప్పుడు కొన్ని చోట్ల నీలంగా.. మరికొన్ని చోట్ల సాధారణంగా కనిపిస్తుంది. నీలంగా కనిపించేది నీరు ఉన్న ప్రదేశం అని తెలిసిందే.. భూమిపై మూడింతల నీరు.. ఒక వంతు మాత్రమే స్థలం ఉందని చిన్న తనం నుంచి సోషల్ మీడియా పుస్తకాలలో చదువుతూనే ఉన్నాం. ప్రపంచ పటాన్ని చూసినప్పుడు అంతా నీలం రంగులో ఒకేలా కనిపించినా, ఆ నీటి భాగాలు, అవి భూమితో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయనే దానిని బట్టి వేర్వేరు పేర్లు పెట్టారు. ఈ పేర్ల వెనుక కోట్ల ఏళ్ల భూగర్భ చరిత్ర, ప్లేట్ టెక్టానిక్స్ (భూఫలకాల కదలికలు) దాగి ఉన్నాయి. స్ట్రెయిట్, బే, గల్ఫ్ వంటి పదాల మధ్య ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను పరిశీలిస్తే..

స్ట్రెయిట్ (జలసంధి).. ఇరుకైన వారధి

రెండు పెద్ద నీటి భాగాలను కలిపే సన్నని, ఇరుకైన సహజ జలమార్గాన్ని 'స్ట్రెయిట్' లేదా జలసంధి అంటారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఇది పర్షియన్ గల్ఫ్‌ను, గల్ఫ్ ఆఫ్ ఒమెన్‌తో కలిపే కీలకమైన దారి. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఇవి సహజంగా ఏర్పడతాయి. ఇరుకుగా ఉండడం వల్ల యుద్ధ సమయాల్లో లేదా ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఈ మార్గాలను మూసివేస్తే ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోతుంది.

బే (అఖాతం).. విశాల ప్రవేశం

మూడు వైపులా భూభాగం ఉండి, ఒక వైపు సముద్రానికి విస్తారంగా (వెడల్పుగా) తెరుచుకొని ఉండే నీటి భాగాన్ని 'బే' అంటారు. బే ఆఫ్ బెంగాల్ (బంగాళాఖాతం). ఇది భారత్, బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య విస్తరించి ఉంది. ఇవి సాధారణంగా వెడల్పుగా ఉంటాయి. గంగా, గోదావరి వంటి పెద్ద నదులు ఇందులో కలవడం వల్ల ఇక్కడ మట్టి పేరుకుపోవడం ఉంటుంది.

గల్ఫ్.. భూమిలోకి చొచ్చుకొచ్చిన సముద్రం

గల్ఫ్ అనేది బే కంటే లోతుగా ఉంటుంది. దీని చుట్టూ భూభాగం ఎక్కువగా ఉండి, సముద్రంతో కలిసే భాగం చాలా సన్నగా ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ ఇలాంటిదే.. బేలో సముద్రం భూమిలోకి వచ్చినట్లు కనిపిస్తే, గల్ఫ్‌లో భూమే సముద్రాన్ని తన కౌగిలిలోకి తీసుకున్నట్లుగా ఉంటుంది. ఇవి తరచుగా ఫాల్ట్ లైన్స్ (భూమి చీలికలు) వెంట ఏర్పడి పొడవుగా కనిపిస్తాయి.

చానల్ vs కెనాల్ మధ్య తేడా..

నౌకాయానానికి ఉపయోగపడే నీటి దారులను చానల్ లేదా కెనాల్ అంటారు. చానల్ అంటే సహజంగా ఏర్పడిన నీటి ప్రవాహ మార్గం. ఉదాహరణకు ఇంగ్లిష్ చానల్ గా చెప్పవచ్చు. ఇక కెనాల్ అంటే ఇది మానవ నిర్మితం. వాణిజ్యం కోసం మనుషులు తవ్విన మార్గం. ఉదాహరణకు సూయజ్ కెనాల్, పనామా కెనాల్. ఇవి ప్రయాణ దూరాన్ని వేల కిలోమీటర్ల మేర తగ్గిస్తాయి. వీటిని మానవులు వారి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నారు.

లాగున్, సముద్రాల వ్యత్యాసం

లాగున్ ఇసుక తిన్నెలు లేదంటే తీర భూభాగం వల్ల సముద్రం నుంచి వేరుపడిన నీరు కలిగిన భాగం. ఉదాహరణకు ఒడిశాలోని చిల్కా లేక్. ఇది పూర్తిగా ఏర్పడిన సరస్సు కాదు అలాగని పూర్తి సముద్రం కాదు. ఖండాల మధ్య విస్తరించి ఉన్న అత్యంత భారీ నీటి భాగాన్ని ఓషెన్ అంటారు. ఉదాహరణకు పసిఫిక్ దీన్ని ఓషెన్ అని పిలుస్తారు.మహాసముద్రం కంటే చిన్నవిగా, భూభాగానికి దగ్గరగా ఉండేదానికి సీ అంటారు. ఉదాహరణగా చెప్పుకుంటే అరేబియన్ సముద్రం

ఈ సహజ నీటి భాగాలు శాశ్వతం కాదు.. తీర ప్రాంత కోత, సముద్ర మట్టాలు పెరగడం, తగ్గడం, నదులు తెచ్చే మట్టి వల్ల వీటి ఆకారాలు లక్షల కాలాంతరాలలో నెమ్మదిగా మారుతూ ఉంటాయి. మనుషులు కెనాల్స్‌ను సృష్టించగలరు కానీ, బే లేదా గల్ఫ్‌లను సృష్టించలేరు. ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలు, ఇవే ప్రపంచ వాణిజ్యానికి, జీవ వైవిధ్యానికి పట్టుకొమ్మలుగా విరాజిల్లుతున్నాయి.

Tags:    

Similar News