మన ఫోన్ లోని యాప్స్ మొత్తం మాయం.. వాటి స్థానంలో ఉండేవి ఇవే..

ప్రస్తుతానికి మనకు ఇది ఊహకు అందకపోయినా, టెక్నాలజీ ఆ దిశగానే శరవేగంగా వెళ్తోంది. ఇప్పటికే స్క్రీన్ లేని ఏఐ పరికరాలు మార్కెట్లోకి వస్తున్నాయి.;

Update: 2026-04-02 08:16 GMT

దూరంగా ఉన్న వ్యక్తులకు సమాచారం అందించేందుకు వచ్చిన పేజర్ నుంచి.. వారితో సంభాషించుకునేందుకు వచ్చిన బేసిక్ మోడల్ (కీ ప్యాడ్ ఫోన్లు) మొబైల్స్ నుంచి నేడు ఫోను ఉంటే కానీ పని ఏ పని జరగని రోజులకు వచ్చాం. స్మార్ట్‌ఫోన్ వచ్చాక అదే మన ప్రపంచంగా మారిపోయింది. ఇప్పుడు ఏ చిన్న పని కావాలన్నా ఒక యాప్ ఉండాల్సిందే. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ‘ఏఐ’ విప్లవం ఆ స్మార్ట్ ఫోన్ల రూపురేఖలను పూర్తిగా మార్చేయబోతోంది. ‘వచ్చే కాలంలో మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ అన్నీ మాయమవుతాయి’ అంటూ నథింగ్ సీఈవో కార్ల్ పీ చేసిన వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు కూడా ఏఐ వల్ల మనిషి పని చేయాల్సిన అవసరమే ఉండదని చెబుతున్నారు.

ఒకే ఒక్క ఏఐ అసిస్టెంట్!

ప్రస్తుతం మన ఫోన్లలో పేమెంట్స్, ఫుడ్, సోషల్ మీడియా, వార్తలు ఇలా ప్రతి దానికీ విడివిడి యాప్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ 30-50 యాప్స్ అవసరం ఉండదు. వాటి స్థానంలో కేవలం ఒకటి లేదంటే రెండు యాప్స్ మాత్రమే అవి కూడా శక్తివంతమైనవే ఉంటాయి. మీరు నోటితో చెబితే చాలు, ఏఐ నేరుగా మీకు కావాల్సిన సర్వీస్‌ను అందిస్తుంది. ఉదాహరణకు, మీరు ‘నాకు బిర్యానీ కావాలి’ అని చెబితే, ఏఐ స్వయంగా ఫుడ్ యాప్స్‌తో కనెక్ట్ అయి ఆర్డర్ చేసేస్తుంది. మీకు ఆ యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరమే ఉండదు.

పని లేని ఆదిమ కాలం!

ఎలోన్ మస్క్ ఏఐ ప్రభావం గురించి ఇంకాస్త లోతుగా విశ్లేషించారు. ఏఐ వల్ల ప్రతిదీ చవకగా అయిపోతుందని, మనిషి కేవలం డబ్బు సంపాదించడానికి పని చేయాల్సిన అవసరం ఉండదని అంచనా వేశారు. ఏదైనా పని చేయడం అనేది మనిషి ఇష్టమైతే చేసేదే తప్ప, బతకడానికి చేయాల్సిన ‘మానవ ధర్మం’లా ఉండదు. వేటాడడం, తినడం తప్ప మరో వ్యాపకం లేని ఆదిమ కాలం లాంటి పరిస్థితులు, కానీ సకల సౌకర్యాలతో మళ్లీ రాబోతున్నాయని మస్క్ భావిస్తున్నారు.

ఆలోచించే అవసరం ఉండదా?

ఏఐ మన మనసులోని ఆలోచనలను కూడా గుర్తించి పని చేయడం వల్ల మనిషి మేధస్సుపై ఒత్తిడి తగ్గుతుంది. మీరేం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేవి కూడా ఏఐ నిర్దేశించే స్థాయికి చేరుకుంటుంది. యాప్స్ వెతకడం, సమాచారాన్ని పోల్చడం వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల మనిషికి బోలెడంత ఖాళీ సమయం దొరుకుతుంది. అయితే, దీనివల్ల మనిషి సోమరిగా మారే ప్రమాదం ఉందనే వాదనలు లేకపోలేదు.

ప్రాక్టికల్ గా సాధ్యమా..?

ప్రస్తుతానికి మనకు ఇది ఊహకు అందకపోయినా, టెక్నాలజీ ఆ దిశగానే శరవేగంగా వెళ్తోంది. ఇప్పటికే స్క్రీన్ లేని ఏఐ పరికరాలు మార్కెట్లోకి వస్తున్నాయి. సిరి (Siri), గూగుల్ అసిస్టెంట్ వంటివి మరింత శక్తివంతంగా మారుతున్నాయి. గూగుల్, యాపిల్ వంటి సంస్థలు కూడా తమ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను ఏఐ ఆధారితంగా మార్చే పనిలో ఉన్నాయి.

రెండు దశాబ్దాలుగా మనం చూస్తున్న ‘యాప్ కల్చర్’కు కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ అంటే యాప్స్ నిలయం కాదు.., అది ఒక ‘ఏఐ మేధస్సు’గా మారబోతోంది. టెక్ దిగ్గజాల అంచనాలు నిజమైతే, రేపు మన ఫోన్ స్క్రీన్ మీద ఐకాన్స్ ఏమీ ఉండవు, కేవలం మన మాట వినే ఒక డిజిటల్ ఫ్రెండ్ మాత్రమే ఉంటాడు. ఈ మార్పు మనిషిని మరింత స్వేచ్ఛగా మారుస్తుందో లేక యంత్రాలపై మరింతగా ఆధారపడేలా చేస్తుందో వేచి చూడడం తప్ప చేసేదేమీలేదు..

Tags:    

Similar News