కాషాయదళాధిపత్యం కోసం. కాకలు తీరిన పోటీ!

Update: 2015-10-09 17:30 GMT
తెలంగాణలో ఏనాటికైనా మేం కూడా అధికారంలోకి వస్తాం అని కలలు కంటున్న పార్టీల్లో భారతీయ జనతా పార్టీ గురించి కూడా చెప్పుకోవాలి. నిజానికి ఒకప్పట్లో ఆ పార్టీకి ఈ ప్రాంతంలో ఉన్న ఊపు, రాష్ట్ర విభజన ఉద్యమాన్ని వారు సమర్థించిన తీరు, నేపథ్యంలో.. అది నిజమైనా కావొచ్చునని కొందరు ఊహించారు. కానీ.. రాష్ట్ర విభజనను పార్టీకి మైలేజీ ఇచ్చేలావాడుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం అయింది.

ఇదంతా ఒక ఎపిసోడ్‌ కాగా.. కొత్తగా ఆ పార్టీకి జవం జీవం అందించడానికి, కొత్త రక్తం ఎక్కించడానికి, పార్టీని తెలంగాణలో కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడానికి సారథ్య బాధ్యతలు ఎవరిని వరించబోతున్నాయి? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్న సమయంలో.. ఇటు రాష్ట్రంలో అధ్యక్ష పదవి అంటే దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో కాకుండా.. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అంటే దేశరాజకీయాల్లో కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. అంతా వారు చూపగల చొరవ, దూసుకుపోయే తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో భాజపాలో చక్రం తిప్పుతున్న తెలుగువారు అనేకులు ఉన్నారు.

ఇలాంటి సమయంలో కాషాయ పార్టీకి అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డినుంచి పగ్గాలు అందుకోవడానికి పలువురు నాయకులు సీరియస్‌గా పోటీ పడుతున్నారుట. కిషన్‌ రెడ్డి ప్రస్తుతం మూడో దఫా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. నిజానికి భాజపాలో ఏ వ్యక్తికైనా రెండు సార్లుకు మించి అధ్యక్షపదవి ఇవ్వరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల.. మరొకరు గతిలేనట్లుగా ఆయనకు మూడోసారి ఇచ్చారు. ఈ నెలాఖరుకు అది కూడా పూర్తవుతుంది. ఇక.. కొత్త నేతను పార్టీ నియమించాల్సి ఉంటుంది. మరోసారి కిషన్‌ ను కొనసాగించే అవకాశం మాత్రం లేదు. పదవిని ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే కీలక పదవులు కలిగి ఉన్న మురళీధరరావు - ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌ - చిలకం రామచంద్రారెడ్డి - ఎమ్మెల్సీ ఒకరు - పేరాల చంద్రశేఖరరావు - ఇంకా పలువురు నాయకులు పదవి విషయంలో పోటీ పడుతున్నారుట. ఎవరికి పదవి ఇచ్చినా సరే.. కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల్లో కొత్త ఆలోచనను కలిగించడంలో వారు కిషన్‌ రెడ్డి కంటే బాగానే పార్టీకి పేరు తేగలరని పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News