రద్దు సీరియల్ ఇంకెంత వరకు సాగుతుంది? టీబీజేపీలో కొత్త నిరాశ

Update: 2023-03-31 12:52 GMT
ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ బీజేపీ క్యాడర్ కు.. ఒక స్థాయి నేతలకు అస్సలు మింగుడుపడని రీతిలో మారుతున్నాయి. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్న వైనం తెలిసిందే. అయితే.. ఈ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకపట్టాన జీర్ణించుకోలేనట్లుగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

మాంచి స్పీడ్ మీద వెళుతున్న వాహనాన్ని అదేపనిగా బ్రేకులు వేస్తే.. ఏం జరుగుతుంది? ఇప్పుడు అలాంటి తీరే బీజేపీ అధినాయకత్వంలో నెలకొన్నట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్న టీబీజేపీకి.. కేంద్రం నుంచి అందాల్సినంత సాయం అందటం లేదంటున్నారు. క్యాడర్ ను ఉత్సాహపరిచేందుకు వీలుగా అధినాయకత్వం తరచూ పర్యటనలు చేయటం.. నేతలకు.. కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తూ ఎలా ముందుకు వెళ్లాలన్న రోడ్ మ్యాప్ చాలా అవసరం.

అయితే.. ఈ విషయంలో బీజేపీ అధినాయకుల పర్యటనలు షెడ్యూల్ కావటం.. చివర్లో రద్దు కావటం ఈ మధ్యన మరీ ఎక్కువ అవుతుంది. దీంతో.. ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీబీజేపీ నేతల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లుగా మారుతుంది.

జనవరి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలు షెడ్యూల్ అయి మరీ రద్దు కావటం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు సైతం షెడ్యూల్ అయి.. చివర్లో రద్దు అవుతున్నాయి.

తాజా పర్యటన కూడా రద్దు అయినట్లుగా గురువారం ప్రకటన వెలువడింది. బీజేపీ అగ్రనేతల పర్యటనలు షెడ్యూల్ కావటం.. చివర్లో రద్దు కావటం ఒక అలవాటుగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం క్యాడర్ లో ఒకలాంటి నిరాశను పెంచుతుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ రద్దు సీరియల్ ఎందుకు సాగుతునట్లు? పర్యటనల రద్దు వెనకున్న అసలు కారణాలేంటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Similar News