జ‌ర్న‌లిస్టులపై దారుణ‌మైన వ్యాఖ్య చేసిన బీజేపీ నేత‌

Update: 2018-04-21 05:01 GMT
మీడియా అంటే మంట పుట్టే నేత‌లకు ఈ దేశంలో కొద‌వ‌లేదు. త‌మ దుర్మార్గాల్ని క‌త్తికో చందంగా చీల్చేసే వారికి మీడియా అంటే అక్క‌సు అంతా ఇంతా కాదు. ప‌వ‌ర్లోకి రావ‌టానికి మీడియాను ఆశ్ర‌యించే నేత‌లు.. ఒకసారి చేతికి ప‌వ‌ర్ వ‌స్తే చాలు.. త‌మ‌కు సాయం చేసిన మీడియాను ఇష్టారాజ్యంగా  చెడుగుడు ఆడుకునేందుకు సైతం వెనుకాడ‌రు.

తాజాగా అలాంటి ప‌నే చేశారు త‌మిళ‌నాడుకు చెందిన‌బీజేపీ నేత ఒక‌రు.

కాకుంటే ఇప్ప‌టివ‌ర‌కూ మీడియాపైనా.. జ‌ర్న‌లిస్టుల‌పైనా ఇంత దారుణ వ్యాఖ్య‌లు చేసినోళ్లు క‌నిపించ‌రు. మీడియా అంటే కోపం.. ఆగ్ర‌హం ఉన్న‌ప్ప‌టికీ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసే విష‌యంలో నేత‌లు కాస్తంత సంయ‌మ‌నం పాటించేవారు. కానీ.. త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ నేత క‌మ్ న‌టుడు ఎస్వీ శేఖ‌ర్ మాత్రం ఆ హ‌ద్దుల్ని చెరిపేసి.. ఎప్ప‌టికి మ‌ర్చిపోలేనంత భారీ మ‌చ్చ‌ను మీడియా మీద వేసేశారు.

ఈ మ‌ధ్య‌న మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ అభ్యంత‌ర‌క‌ర చ‌ర్య‌కు పాల్ప‌డ‌టం.. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో ఫేస్ బుక్ లో ఒక వ్యాఖ్య‌ను షేర్ చేశారు.చ‌దువుకోని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. విద్యాసంస్థ‌ల్లో కంటే మీడియాలోనే లైంగిక‌వేధింపులు ఎక్కువ‌. పెద్ద మ‌నుషుల‌తో ప‌డుకోకుంటే మీడియా సంస్థ‌ల్లో ఎవ‌రూ రిపోర్ట‌ర్లు.. న్యూస్ యాంక‌ర్లు కారంటూ నోరు పారేసుకోవ‌టం గ‌మనార్హం.

త‌మిళ‌నాడు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ల‌క్ష్మి సుబ్ర‌మిణియ‌న్ ను తాకినందుకు గ‌వ‌ర్న‌ర్ పురోహిత్ త‌న చేతిని ఫినాయిల్ తో క‌డుక్కోవాల‌ని.. త‌మిళ‌నాడులో నేర‌స్తులు.. నీచులు.. బ్లాక్ మెయిల‌ర్ల చేతిలో మీడియా చిక్కుకున్న‌ట్లుగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాను షేర్ చేసిన పోస్టుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టంతో ష‌రా మామూలే అన్న‌ట్లుగా సారీ చెప్పేసి.. త‌న దృష్టికి వ‌చ్చిన పోస్టును చ‌ద‌వ‌కుండానే షేర్ చేయ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పుకుంటూ త‌న త‌ప్పు లేద‌న్న‌ట్లుగా చేతులు దులిపేసుకున్నారు.
Tags:    

Similar News