పోటీ చేసినా ప్రయోజనం జీరోనేగా లక్ష్మణ్

Update: 2016-04-29 05:33 GMT
లేని బలాన్ని ఉన్నట్లుగా ప్రదర్శించుకోవటం కొన్నిసార్లు జరుగుతుంది. ఆటను ఏ మాత్రం ప్రభావితం చేయలేని ఆటగాడు ఆడినా.. ఆడకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ.. తాను కానీ ఆటలోకి దిగితే ఏదో జరుగుతున్న బిల్డప్ ఇచ్చే వాళ్లు మామూలే. ఇక.. రాజకీయాల్లో ఈ తరహా మాటలు కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తాజాగా ఈ తరహా మాటలే చెప్పుకొచ్చారు.

తెలంగాణను తేవటంలో తాము కీలకపాత్ర పోషించినట్లుగా తెలంగాణ బీజేపీ నేతలు చెప్పుకున్నా.. వారి మాటలకు తెలంగాణ ప్రజలు ఓట్లతో ఇచ్చిన సమాధానం ఏమిటో.. 2014సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పేశాయి. హైదరాబాద్ తప్పించి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా తమ ప్రభావాన్నిపెద్దగా చూపించలేని కమలనాథులు.. బడాయి మాటలు మాత్రం చాలానే చెబుతుంటారు. తెలంగాణలో అధికారపార్టీకి తామే ప్రత్యామ్నాయంగా గొప్పలు చెప్పుకుంటారు. మొత్తం కలిపితే సింగిల్ డిజిట్ దాటని ఎమ్మెల్యేలు ఉన్నా.. మాటలు మాత్రం కోటలు దాటే పరిస్థితి.

తాజాగా జరుగుతున్న ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయటం లేదని ప్రకటించారు లక్ష్మణ్. అంతేకాదు.. తాము ఎవరికీ మద్దతు కూడా ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. మరి.. బీజేపీ మద్దుతుదారులు ఎవరికి ఓటు వేయాలి? అన్న ప్రశ్న అక్కర్లేదని.. ఎవరికి ఓటు వేయాలన్న విషయం మీద బీజేపీ అభిమానులకు అవగాహన ఉన్నట్లు చెప్పుకొచ్చారు. లక్ష్మణ్ ఇలా మాటలు చెబుతుంటే.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం మరోలా రియాక్ట్ అవుతున్నారు. అసలు బలం ఉంటేగా పోటీ చేయటానికి..? అంటూ కాస్త ఎటకారంగా కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News