ఎన్నికల వేళ 9మంది రెబల్స్ పై బీజేపీ వేటు

Update: 2020-10-13 14:00 GMT
బీహార్ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం అక్కడ జేడీయూ నేత, సీఎం నితీష్ తో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకెళుతోంది. మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని హోరా హోరీ తలపడుతున్నాయి.

243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగియనుంది. ఈ క్రమంలో ఆ గడువులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకే కరోనా కాలంలో ఈసీ ఎన్నికలకు పచ్చా జెండా ఊపింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగితేలుతున్నాయి.

బీహార్‌ శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 28న, రెండో విడత నవంబర్‌ 3న, మూడో విడత ఎన్నికలు నవంబర్‌ 7న నిర్వహిస్తారు. నవంబర్‌ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహిస్తారు. మొదటి విడతలో 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో 17 జిల్లాల్లోని 94 స్థానాలకు, మూడో దశలో 78 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బీహార్ లో అధికారం చేతులు మారవద్దని బీజేపీ పట్టుదలతో ఉంది. అందుకే రెబల్స్ పై కఠినంగా ముందుకు వెళుతోంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులపై పోటీకి దిగనున్న 9మంది బీజేపీ నేతలను పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది.

బీజేపీ రెబల్స్ వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిపై కఠిన చర్యలు తీసుకున్నామని కమలనాథులు తెలిపారు.

ఈ 9మంది రెబల్స్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్లను ఆశించారు. కానీ వారికి బీజేపీ అధిష్టానం టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ తొమ్మిది మంది బీజేపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఎన్డీఏ అభ్యర్థులపై పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు.
Tags:    

Similar News