అయ్యో బీజేపీ.. మళ్లీ నిరాశజనక ప్రదర్శనే!

Update: 2023-03-18 21:17 GMT
జాతీయ స్థాయిలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ. ఆ పార్టీ ఆంద్రప్రదేశ్‌ లో కూడా బీజేపీ చక్రం తిప్పాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే ఒంటరిగా ఆ పార్టీ ఇప్పటి వరకు సాధించింది ఏమీ లేదు. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో జతకడితేనే బీజేపీ చాలా వరకు లాభపడింది. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నిక నుంచి బీజేపీ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. తిరుపతి లోక్‌ సభా నియోజకవర్గం ఉప ఎన్నికలో ఓడిపోయిన బీజేపీ ఆ తర్వాత బద్వేలు ఉప ఉన్నికలోనూ పోటీ చేసి పరాజయం పాలైంది.

అలాగే జగన్‌ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతితో జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ బీజేపీ ఓడిపోయింది. దీనికి కారణం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కారణమంటున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలు పార్టీని ఇబ్బందులకు గురి చేశాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సైతం సోము వీర్రాజుపైనే బహిరంగంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో ఉన్న నేతల్లో చాలా మంది 2019 ఎన్నికల తర్వాత టీడీపీ, తదితర పార్టీల నుంచి వచ్చి చేరినవారే. ఆ నేతలు బీజేపీలో ఉన్నా వారి మనసంతా వారి మాతృ పార్టీలతోనే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నిరాశజనక ఫలితాలు సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే ఇటీవల బీజేపీలోని కొంతమంది నేతలు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా బీజేపీ అధిష్టానం పెద్దలను కలిశారు. సోము వీర్రాజును మార్చాలని డిమాండ్‌ చేశారు. సోము ఒంటెద్దు పోకడలు పోతున్నారని.. ఆయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో  నేతల మధ్య స్పష్టమైన సమన్వయం లేకపోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అసలు బలహీనత మరోసారి బట్టబయలైందని అంటున్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్‌ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు. మాధవ్‌ కు వచ్చిన ఓట్లతో పోలిస్తే చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒకవైపు నేతల మధ్య అనైక్యత, క్యాడర్‌ లేమి బీజేపీకి శాపంగా మారిందని చెబుతున్నారు.

మరోవైపు జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉంది. జన సేన ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలలో పూర్తిగా మౌనంగా ఉన్నారు. పవన్‌ అడిగిన రోడ్‌ మ్యాప్‌ ఇవ్వకపోవడంతో జనసేన క్యాడర్‌ బీజేపీపై విశ్వాసం కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పైగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని కాపు సామాజికవర్గం బీజేపీని అనుమానంగా చూడటం మొదలుపెట్టింది. జనసేన కార్యకర్తలు, అభిమానులు తమకు సరైన భాగస్వామి టీడీపీ ఒక్కటే అనే నిర్ణయానికి వచ్చారు. దాంతో టీడీపీ అభ్యర్థి గెలుపు సులువైంది.

బీజేపీకి చెందిన మాధవ్‌ మంచి వ్యక్తి అయినా, పలుకుబడి ఉన్నా ఎన్నికల్లో పని చేయలేదు. బీజేపీలో ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌లో మరింత గడ్డు రోజులు తప్పవని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News