ముహూర్తం కుదిరిందా ?

Update: 2023-05-29 10:47 GMT
ప్రతిపక్షాల భేటీకి ముహూర్తం కుదిరిందా ? అవుననే అంటున్నది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ. జూన్ 12వ తేదీన పాట్నాలోని నితీష్ నివాసంలోనే విపక్షాల అధినేతలందరు సమావేశం కావాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ సమావేశానికి 20 పార్టీలైతే కచ్చితంగా హాజరవుతాయనే నితీష్ అనుకుంటున్నారు.

కొత్తగా ప్రారంభమైన పార్లమెంటు భవనం కార్యక్రమానికి గైర్హాజరవ్వాలని 20 పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లుగానే 20 పార్టీలూ కార్యక్రమానికి హాజరుకాలేదు.

అంటే తీసుకున్న నిర్ణయానికి 20 పార్టీలు కట్టుబడి ఉన్న విషయం అర్ధమవుతోంది. ఇలాంటి ఐకమత్యమే ముందుముందు కూడా ఉంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించటం కష్టంకాదని నితీష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే 12వ తేదీన హాజరయ్యే పార్టీలేవి, జరిగే చర్చలు ఏమిటి ? తీసుకోబోయే నిర్ణయాలపైనే ప్రతిపక్షాల భవిష్యత్తు ఆధారపడుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏతో ఎలాంటి సమస్యలు ఉండవు. సమస్యలంతా బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తెలంగాణా సీఎం కేసీయార్ లాంటి వాళ్ళతోనే వస్తాయి. ఇప్పటివరకు కేసీయార్ ఒక్కోసారి ఒక్కోరకమైన స్టాండ్ తీసుకుంటున్నారు.

కాబట్టి 12వ తేదీ సమావేశానికి హాజరయ్యేది లేనిది తెలీదు. ఇక మమతను ఎంతమాత్రం నమ్మేందుకు లేదు. ఆమె ఏ నిముషంలో ఎలాగుంటారో ఎవరు చెప్పలేరు. ఇప్పటికి బీజేపీ వ్యతిరేకతనే చూపిస్తున్నారు. మరి రేపు కూడా ఇదే వైఖరితో ఉంటారా అన్నదే డౌటు.

ఏదేమైనా చాలా ప్రతిపక్షాలు ఒక విషయాన్ని గ్రహించాయి. అదేమిటంటే ఎన్డీయేని దెబ్బకొట్టాలంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యంకాదని. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో ప్రతిపక్షాల్లో ఈ భావన బాగా బలపడిందనే చెప్పాలి. అందుకనే కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా మమత ప్రకటించారు.

జాతీయస్ధాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయటానికి మమత గనుక అంగీకరిస్తే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి. అప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్దులపై ప్రతిపక్షాల తరపున వన్ ఆన్ వన్ అనే ఫార్ములాలో అభ్యర్ధులను పోటీలోకి దింపేందుకు అవకాశముంటుంది. 12వ తేదీ సమావేశంలో ఏమవుతుందో చూడాలి.

Similar News