ఎలాన్ మస్క్ కు అతని స్టైల్లో గట్టి పంచ్ వేసిన మనోడు!

Update: 2022-05-29 04:49 GMT
అవసరానికి మాత్రమే జనం మధ్యకు వచ్చి.. తాము చెప్పాల్సింది చెప్పేసి.. మళ్లీ తమ ప్రపంచంలోకి దూరిపోయి.. తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు పారిశ్రామికవేత్తలు. వ్యాపారంలో భాగంగానే బయటకు వస్తుంటారు.

సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా 95 శాతానికి పైగా పారిశ్రామికవేత్తలు తమదైన ప్రపంచంలోనే ఉంటారు తప్పించి.. అనవసరమైన తలనొప్పులు తెచ్చి పెట్టే సోషల్ మీడియా రచ్చలోకి అడుగు పెట్టటానికి అస్సలు ఇష్టపడరు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే ప్రపంచ కుబేరుడు టెస్లా కార్ల అధినేత ఎలాన్ మస్క్ మాత్రం సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక రచ్చ చేస్తుంటారు. సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరిమీదనైనా పంచ్ వేసే అతడి ట్వీట్లు చూస్తే.. మన సంచలన దర్శనకుడు రాంగోపాల్ వర్మ సైతం టుమ్రీగా కనిపిస్తారు. అలాంటి మస్క్ కు తాజాగా భారత్ కు చెందిన పారిశ్రామిక ప్రముఖుడు సోషల్ మీడియాలో గట్టి పంచ్ వేసిన వైనం ఆసక్తికరంగా మారింది. వ్యంగ్య వ్యాఖ్యలు చేసే ఎలాన్ మాస్క్ తరహాలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈవో భవీష్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. టెస్లా కార్లను అమ్ముకునేందుకు పన్ను రాయితీ ఇవ్వని దేశంలో కార్ల తయారీ పరిశ్రమను పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ వ్యాఖ్యతో ఎలాన్ ఇండియాకు వచ్చే ఆలోచన లేదని.. ఆ ఆసక్తి లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన భవీష్.. ఎలాన్ మస్క్ స్టైల్ లో బదులిచ్చారు. ‘థ్యాంక్స్.. బట్ నో థ్యాంక్స్’ అంటూ రీట్వీట్ చేసిన ఆయన.. ‘నువ్వు ఇండియాకు వస్తే ఏంటి? రాకపోతే ఏంటీ?’ అన్నట్లు బలమైన పంచ్ వేశారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో సంచలనంగా మారిన ఓలా.. రానున్న రోజుల్లో ఎలక్ట్ట్రిక్ కార్ల రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఇలాంటి వేళ.. భారత్ లాంటి పెద్ద మార్కెట్ కు రాకుండా.. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే ఎలాన్ కు బలమైన పంచ్ ఇవ్వటం ద్వారా ఓలా మీద భారతీయ నెటిజన్ల మనసుల్ని దోచుకునేలా చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి.. దీనికి ఎలాన్ మస్క్ రియాక్టు అవుతారా? లేదంటే.. లైట్ తీసుకుంటారా? అన్నది చూడాలి.
Tags:    

Similar News