రాములోరి గుళ్లో తూకాలు వేస్తూ..నే ఉన్నారు

Update: 2016-08-24 05:33 GMT
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో సీతమ్మ వారి పుస్తె మిస్ అయ్యిందని.. మరికొన్ని అభరణాలు కనిపించటం లేదన్న సమాచారం కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావటంతో ఆభరణాల లెక్క చూడాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ లెక్కలు తేల్చేందుకు ఆర్చకస్వాములు రంగంలోకి దిగి తూకాలు తూయటం.. అందులో కొన్ని కనిపించటం లేదన్న సమాచారం మరింత ఆందోళనకు గురి చేసింది. అయితే.. దీనికి సంబందించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇదిలా ఉండగా.. రాములోరి గుడిలో ఉన్న బంగారు... వెండి ఆభరణాలు మొత్తాన్ని లెక్క తీయాలని అధికారులు భావించారు.

ఆభరణాల మిస్సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటంతో తొలుత జరిపిన విచారణలో కొన్ని ఆభరణాలు కనిపించటం లేదన్న ప్రాధమిక నిర్దారణకు వచ్చారు. అయితే.. అలా కనిపించని ఆభరణాలు నిజంగా మిస్ అయ్యాయా? లేక.. మరొక చోట పెట్టి లెక్కలోకి రాలేదా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. అయితే.. ఆభరణాల మిస్ ఫిర్యాదు ఆధారంగా ఆలయ ప్రధాన ఆర్చక..ఉప ఆర్చక స్వాములతో పాటు.. రిటైర్డ్ ఉప ప్రధాన ఆర్చకుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని మొత్తం ఆభరణాల లెక్క తేల్చాలని నిర్ణయించారు.

దీంతో.. రాములోరి ఆలయంలో ఉన్న 50 కేజీల బంగారు.. 750 కేజీల వెండి ఆభరణాల లెక్కల్లోకి అధికారులు దృష్టి సారించారు. ఆర్చక స్వాముల చెంత.. రిజిష్టర్ ఆధారంగా లెక్కలు చూడటం మొదలెట్టారు. ఆలయంలోని ఆభరణాల లెక్క మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాత కానీ.. ఆభరణాల మిస్సింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. ఇప్పటివరకూ బంగారు ఆభరణాలు మాత్రమే లెక్క చూడాలని భావించినా.. తాజా పరిస్థితుల్లో వెండి లెక్క కూడా చూస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. గుడికి చెందిన మొత్తం ఆభరణాల లెక్క ఈసారి తేలిపోనుంది. అయితే..ఈ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మహా లెక్క పూర్తి అయ్యాక మాత్రమే మిస్ అయిన ఆభరణాలు ఎన్ని అన్న విషయం తేలే వీలుంది. అప్పటి వరకూ అంచనాలు మాత్రమే తప్ప వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం లేదు. మరీ.. తూకం లెక్కలు ఎన్ని రోజులు సాగుతాయో మరి..?
Tags:    

Similar News