ఈటలను తిట్టి కేసీఆర్ ను ప్రసన్నం చేసుకుంటున్నారా?

Update: 2021-06-19 16:30 GMT
రాజకీయాల్లో అణుకువ ఉన్నన్నీ రోజులు అందలం.. ఎదురుతిరిగామా? అథోగతే.. ఆలె నరేంద్ర నుంచి విజయశాంతి, ఈటల వరకు టీఆర్ఎస్ లో ఫైర్ బ్రాండ్లకు చోటు లేదని నిరూపితమైందన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ ను ఎదురించిన వారందరినీ బయటకు పొగబెట్టి పంపించారన్న విమర్శ ఉంది.

ఈటల రాజేందర్ కూడా 'తెలంగాణకు మేమే ఓనర్లం' అని తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ సమయం చూసి దెబ్బకొట్టి పంపించాడని అంటున్నారు. అయితే ఈటల ఎపిసోడ్ ను ఇప్పుడు టీఆర్ఎస్ లోని సీనియర్లు క్యాష్ చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్లు తమతోపాటు ఉండి బీజేపీలో చేరిన ఈటలను ఇప్పుడు సీనియర్లు అందరూ తిట్టేస్తుండడం చర్చనీయాంశమైంది.

టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో పడేందుకు ఈటలను తెగ తిట్టేస్తున్నారట.. ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవుల కోసం ఈటలపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి..

కేసీఆర్ ఇదే రీతిలో పక్కనపెట్టిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సైతం తాజాగా ఈటలను తిట్టిపోశారు. కేసీఆర్ పదవి ఇవ్వకపోవడంతో కొద్దిరోజులు మౌనంగా గుర్రుగా ఉన్న ఆయన కూడా ఈటలపై సడెన్ గా తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. కేసీఆర్ మెప్పుకోసమని.. మళ్లీ పదవిని రెన్యూవల్ చేసుకోవడం కోసమని  చర్చ సాగుతోంది.

ఇక కౌన్సిల్ మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం ఈటలను టార్గెట్ చేశారు. ఒకసారి మండలి చైర్మన్ అయిన ఆయన పదవీకాలం పూర్తి అయిపోయింది. కేసీఆర్ ఇప్పటివరకు ఈయనకు పదవిపై భరోసా ఇవ్వలేదు. దీంతో ఈటలను తిట్టడం మొదలుపెట్టాడని.. రెన్యూవల్ కోసమే ఇదంతా అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో 7 ఖాళీలున్నాయి. అందులో ఐదు స్థానాలు కొత్తవారితో భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. రెండు స్థానాలు మాత్రమే పాతవారికే రెన్యూవల్ చేస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో మిగిలిన స్థానాల కోసం ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్లు అంతా ఈటలను తిట్టి కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News