తాళాలు పగులగొట్టి డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆక్రమించుకున్న లబ్ధిదారులు

Update: 2021-09-03 15:30 GMT
డబుల్ బెడ్ రూంలు కట్టారు. అయితే లబ్ధిదారులకు ఇవ్వడానికి మాత్రం ఏళ్లకు ఏళ్లు జాప్యం చేశారు. సంవత్సరం అవుతున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఇక ఉండబట్ట లేక లబ్ధిదారులే ఆక్రమించేశారు. సంవత్సరాలుగా వేచిచూస్తున్న కొంత మంది లబ్ధిదారులు వాటిని నేరుగా ఆక్రమించుకున్నారు.

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కొన్ని నిర్మాణం కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరోవైపు నిర్మాణం పూర్తైనా వాటిని లబ్ధిదారులకు అందించడంలో అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు విఫలమయ్యారు. ఈక్రమంలోనే సంవత్సరాలుగా వేచిచూస్తున్న లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కష్టాలు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది లబ్ధిదారులు ఇళ్లను స్వాధీనం చేసుకోకముందే ప్రాణాలు విడిచిన సంఘటనలున్నాయి. తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూంలను ఇప్పటికీ కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆక్రమించుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నూకపెల్లిలో కొద్దికాలం క్రితం డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. కానీ ఇప్పటివరకు వాటిని లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంతో నేరుగా లబ్ధిదారులే తాళాలు పగులగొట్టి గృహప్రవేశాలు చేశారు. ఎలాంటి ప్రారంభోత్సవాలు లేకుండా.. హంగు ఆర్బాటాలు లేకుండా కొత్త ఇండ్లలోకి ప్రవేశించి అధికారులకు షాకిచ్చారు. ఇళ్లల్లో పాలు పొంగించారు.

గత దసరాకు ఇండ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే చెప్పారని.. కానీ ఇప్పటివరకు కేటాయించలేదని లబ్ధిదారులు వాపోయారు. గుడిసెలు వేసుకొని ఉంటున్న తాము విషపురుగులకు బలి అవుతున్నామని.. పాములు వస్తున్నాయని వర్షకాలం కావడంతో అందుకే ఇళ్లను ఆక్రమించుకున్నట్టు లబ్ధిదారులు తెలిపారు.


Tags:    

Similar News