ఒబామాకు ఇంటిపోరు..ట్రంప్ కే మద్దతు!

Update: 2016-07-26 03:52 GMT
ప్రస్తుతం తన నోటిమాటలతో ప్రపంచవ్యాప్తంగా కొత్తరకం పబ్లిసిటీని సంపాదించుకున్నారు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోవున్న డొనాల్డ్ ట్రంప్‌. ఒకవర్గం ప్రజలంతా తనవైపే ఆలోచిస్తారని నమ్మకంగా చెబుతున్నా ట్రంప్ కు తాజాగా మరో బలమైన మద్దతు దొరికింది. అది మరేవరితోనో అయితే పెద్ద విషయం కాకపోవచ్చు కానీ... అతడు స్వయంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామా కు సోదరుడు! దీంతో ప్రస్తుతం ఈ విషయం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి.

ఇప్పటివరకూ డెమోక్రట్లకు మద్దతుగానే ఉన్న ఒబామా సోదరుడు మాలిక్ ఒబామా.. ఈసారి తన ఓటు ట్రంప్‌ కే అని కెన్యాలోని న్యాంగోమా కొగెలో గ్రామం నుంచి అమెరికా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ సందర్భంగా స్పందించిన మాలిక్.. డొనాల్డ్ ట్రంప్ హృదయం నుంచి మాట్లాడుతారని - అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దడం గొప్ప నినాదమని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు బరక్ ఒబామా యంత్రాంగం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన మాలిక్ ఒబామా.. ప్రైవేట్ ఈ మెయిళ్ల వ్యవహారంలో హిల్లరీ క్లింటన్‌పై వచ్చిన ఆరోపణలను విచారించకూడదని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అలాగే మొహమ్మద్ గడాఫీని.. క్లింటన్ - ఒబామాలే కలసి చంపించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాలిక్. కాగా.. అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల తరఫున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌ కు ఒబామా ప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.
Tags:    

Similar News