కారులో సజీవదహనం.. ఇలా జరుగుతుందని మీరెప్పుడు ఊహించని ఘటన

Update: 2020-07-30 04:00 GMT
షాకింగ్ ఉదంతం ఒకటి ఏపీలోని నంద్యాల పరిధిలో చోటు చేసుకుంది. విన్నంతనే అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అంతేనా.. అసలు ఇలాంటివి జరుగుతాయా? అన్న సందేహం కలుగక మానదు. నంద్యాల సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారులోనే ఇరుక్కుపోయిన వ్యక్తి.. సజీవ దహనమయ్యాడు. అసలీ ఘటన ఎలా జరిగిందన్నది చూస్తే.. కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చెందిన శివకుమార్ పుట్టుకతోనే పోలియో సోకటంతో రెండు కాళ్లు పని చేయవు.

అయినప్పటికీ బాగా చదువుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టును సొంతం చేసుకున్నాడు. అతనికి భార్య.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాజాగా శివకుమార్ తల్లిదండ్రులు ఇద్దరు వరుసగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. స్నేహితుల సాయంతో తల్లిదండ్రుల్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేయిస్తూ ఆసుపత్రిలోనే ఉంచారు.

ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణానికి దగ్గరకు వచ్చిన సమయంలో తమ కారు ముందు వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయటంతో.. కారు అందులోకి ఇరుక్కుపోయింది. అయితే.. లారీ డ్రైవర్ ఇదేమీ గమనించకుండా కిలోమీటర్ల కొద్దీ లాక్కెళ్లిపోయాడు. అదే సమయంలో కారులో మంటలు చెలరేగాయి. కారులోని స్నేహితులు బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు.

 కానీ.. శివకుమార్ మాత్రం కారులో నుంచి బయటకు రాలేక.. అందులోనే సజీవదహనమయ్యాడు. లారీని ఓవర్ చేసిన మరో లారీ డ్రైవర్ చెప్పే వరకు.. లారీ వెనుక ఇంత జరుగుతుందన్న విషయం సదరు లారీ డ్రైవర్ కు తెలీకపోవటం గమనార్హం. కలలో కూడా ఊహించలేని రీతిలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు షాక్ తిన్నారు.
Tags:    

Similar News