అసద్ పై అజహర్.. కాంగ్రెస్ ఢీ

Update: 2019-02-28 12:10 GMT
పాత మిత్రుడు, ప్రస్తుత శత్రువు అయిన ఎంఐఎంను అంత ఈజీగా వదలద్దని టీకాంగ్రెస్ రెడీ అయ్యింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ కు భేషరతుగా మద్దతు ఇచ్చి అనాధిగా ముస్లిం ఓటు బ్యాంకు కలిగి ఉన్న కాంగ్రెస్ కు షాకిచ్చాడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు అసద్ కు షాకివ్వడానికి కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది.

హైదరాబాద్ లోక్ సభ స్థానంలో టీఆర్ఎస్ ఎలాగూ పోటీచేయడం లేదు. దీంతో అసదుద్దీన్ కు పోటీగా పాతబస్తీకే చెందిన హైదరాబాద్ ప్రముఖ క్రికెటర్ అజహారుద్దీన్ ను రంగంలోకి దించడానికి కాంగ్రెస్ రెడీ అయ్యింది.

వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం కసరత్తు ప్రారంభించింది. ప్రతీ నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తోంది. ఈ జాబితాను త్వరలోనే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోక్ సభ నుంచి మాజీ క్రికెటర్, హైదరాబాద్ కు చెందిన అజారుద్దీన్ ను బరిలోకి దింపాలని ప్రతిపాదన పంపినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి 2009, 2014 సాధారణ ఎన్నికల్లో అసదుద్దీన్ పోటీచేసి గెలుపొందారు. త్వరలో 2019లో మరోసారి పోటీ పడబోతున్నారు. ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషించిన కాంగ్రెస్ చివరకు అజారుద్దీన్ ధీటైన వ్యక్తి అని.. పాతబస్తీకే చెందిన వాడు కావడంతో అసదుద్దీన్ కు గట్టి పోటీ అని కాంగ్రెస్ తెరపైకి తెచ్చినట్టు సమాచారం.

 క్రికెట్ లో రిటైర్ అయిన అజార్ 2009లో యూపీలోని మోర్దాబాద్ నుంచి పోటీచేసి గెలిచారు. 2014లో టోంక్ సవాయి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఈసారి 2019లో సొంత ఇలాఖా హైదరాబాద్ నుంచి బరిలోకి దించడానికి కాంగ్రెస్ రెడీ అయ్యింది. మరి అజార్.. ఓవైసీని ఓడిస్తాడో లేదో చూడాలి మరి.
    

Tags:    

Similar News