ఢిల్లీ బీజేపీ చీఫ్ ఇంటి మీదే దాడి!

Update: 2017-05-01 06:52 GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఒక ప్ర‌ముఖుడి ఇంటిపై దాడి జ‌రిగింది. అత్యంత ప్ర‌ముఖులు ఉండే నార్త్ అవెన్యూలోని ఢిల్లీ బీజేపీ చీఫ్ మ‌నోజ్ తివారీ ఇంటిపై దుండ‌గులు కొంద‌రు దాడి చేయ‌టం విశేషం. ఆదివారం రాత్రి ఎనిమిది.. తొమ్మిది మంది క‌లిసి త‌న ఇంటిపై దాడి చేశార‌ని.. ఆ స‌మ‌యంలో తాను ఇంట్లో లేర‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న ఇంటి మీద జ‌రిగిన దాడి మొత్తం.. పోలీసుల కుట్ర‌గా అభివ‌ర్ణించిన మ‌నోజ్ తివారీ.. తాజా ఉదంతంలో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులు గాయ‌ప‌డిన‌ట్లుగా చెప్పారు.

ప‌థ‌కం ప్ర‌కార‌మే త‌న ఇంటి మీద దాడి జ‌రిగిన‌ట్లుగా చెప్పిన తివారీ.. త‌న ఇంటి వ‌ద్ద కొంద‌రు అన‌వ‌స‌ర‌మైన మాట‌లు అనుకుంటూ తిట్టుకుంటూ క‌నిపించారని.. ఆ టైంలో త‌న ఇంటికి చెందిన వారు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. వారిపై దాడి చేసి ఇంటిపై దాడి చేశార‌న్నారు. జ‌రిగిన ఉదంతాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ల రూపంలో వెల్ల‌డించారు.

ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసుల మాట మాత్రం మ‌రోలా ఉంది. ఇదంతా రోడ్ల మీద జ‌రిగే చిల్ల‌ర పంచాయితీలుగా అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. ఈ ఉదంతానికి సంబంధించి ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లుగా పోలీసులు చెబుతుంటే.. ఇదంతా పోలీసుల కుట్ర‌లో భాగంగానే త‌న ఇంటిపై దాడి జ‌రిగింద‌ని మ‌నోజ్ తివారీ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో అస‌లేం జ‌రుగుతోంద‌న్న ఆయ‌న‌.. పోలీసుస్టేష‌న్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న ఒక ఎంపీ ఇంట్లోకి దుండ‌గులు ప్ర‌వేశించి.. అర‌గంట‌పాటు బీభ‌త్సం సృష్టించ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

త‌న సిబ్బందిపై దాడి జ‌రిగిన తీరు.. త‌న ఇంటికి పోలీసులు క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ఈ వ్య‌వ‌హారాన్ని హోంశాఖ దృష్టికి తీసుకెళ‌తాన‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మ‌నోజ్ తివారీ నేతృత్వంలో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించ‌టం.. ఈ ఎన్నిక‌ల్లో పాల‌క ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ప‌రాజ‌యం పాలు కావ‌టాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News