హుందాతనం కోల్పోయిన అసెంబ్లీ

Update: 2020-12-01 12:30 GMT
అసెంబ్లీ సమావేశాల్లో చర్చలంటే ఒకపుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. సభలో సభ్యుల మధ్య జరిగే చర్చలు, వాద ప్రతివాదనల ఫాలో అయ్యేందుకు ఇంట్రస్టు చూపేవారు. కానీ కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలంటేనే వెగటు పుడుతోంది. ఈ పరిస్ధితికి వీళ్ళు వాళ్ళు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరు కలిసే సభ మర్యాదను, ప్రతిష్టను దిగజార్చేస్తున్నారు కాబట్టి. ప్రతిపక్షమన్నాక ప్రభుత్వాన్ని రెచ్చగొడుతునే ఉంటుంది. అందుకు అధికారపక్షం కాస్త సంయమనం పాటించాలి. ప్రతిపక్షం ఎంతగా రెచ్చగొట్టినా ప్రభుత్వ వైపు నుండి కాస్త ఓపికుంటే చాలా సమస్యలు సర్దుకుంటాయి.

సమైక్య రాష్ట్రంలో ఏమి జరిగింది ? సమావేశాల తీరు తెన్నులను వదిలిపెట్టినా 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏమి జరిగిందని తెలుసుకుంటే సరిపోతుంది. 104 మంది ఎంఎల్ఏలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సభలో కానీ బయటకానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించటానికి ఇష్టపడలేదు. అసెంబ్లీ ఎప్పుడు జరిగినా వ్యక్తిగతంగా టార్గెట్ చేయించారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, దేవినేని, గొల్లపల్లి సుర్యారావు, ప్రత్తిపాటి పుల్లారావు, బోండా ఉమ లాంటి అనేకమంది జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించారు. గజదొంగ, జైలు పక్షి అనే పదాలతో జగన్ ను బాగా ఇబ్బంది పెట్టేవారు. ఆ వీడియోలు  ఇప్పటికీ యూట్యూబ్ లో కనబడతాయి. పైగా వైసీపీ ఎంపిలు, ఎంఎల్ఏలను చంద్రబాబు లాగేసుకున్నారు.

తమకు సభలో జరుగుతున్న అవమానాలను జగన్ కానీ లేదా వైసీపీ సభ్యులు కానీ ఎంత మొత్తుకున్నా అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొన్ని పట్టించుకోలేదు. కొన్ని పట్టించుకున్నారు. మంత్రలు తమ నోటికొచ్చినట్లు తిడుతున్నా ఏ రోజు వాళ్ళని వారించలేదు. అదే సమయంలో వైసీపీ సభ్యులు ఎదురుదాడి మొదలుపెట్టగానే వెంటనే మైక్ కట్ చేసేసిన ఘటనలు కొన్ని వందలున్నాయి. ఇటువంటి అనేక విషయాలతో విసిగిపోయిన జగన్ చివరకు అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించేశారు. వెంటనే చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్ళిపోయారు.

అప్పట్లో చంద్రబాబు ఆలోచన ఏమిటంటే ఎప్పటికీ తానే అధికారంలో ఉంటానని అనుకున్నారు. అందుకనే 2050 వరకు టీడీపీనే అధికారంలో ఉంటుందని, ఉండాలంటూ బహిరంగంగానే చెప్పేవారు. కానీ ఐదేళ్ళు గడిచేసరికి సీన్ రివర్సయిపోయింది. 2019 ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోతానని ఊహించని చంద్రబాబుకు ఎన్నికల ఫలితాలు పెద్ద షాకే ఇఛ్చాయి. ఆ షాక్ నుండి చంద్రబాబు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు.   దాంతోనే సమస్యలన్నీ పెరిగిపోతున్నాయి.

ఇదే సమయంలో  అఖండ మెజారిటి అదికారంలోకి వచ్చిన జగన్ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు చంద్రబాబు లాగే వ్యవహరిస్తున్నారు. తమకు జరిగిన అవమానాలకు ఇపుడు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లే అనుమానంగా ఉంది. యాక్షన్ కు రియాక్షన్ లా ఉంది. అప్పట్లో చంద్రబాబు కొన్ని తప్పులు చేశాడు కాబట్టి ఇపుడు జగన్  కూడా నాకు మాత్రం ఆ ఛాన్స్ లేదా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News