జైట్లీ ఎంత జాగ్రత్తగా మాట్లాడారో చూశారా?

Update: 2016-05-05 09:23 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనన్న అంశం అంత సింఫుల్ వ్యవహారం కాదన్న విషయం మోడీ సర్కారు అర్థం చేసుకున్నట్లుంది. పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ తమకు ఉన్నప్పటికీ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వేసే తప్పటడుగు తమ పుట్టి ముంచుతుందన్న విషయాన్ని అర్థం చేసుకుందో? లేక.. తొందరపాటు పనికిరాదని భావించిందో.. లేకపోతే ఇప్పటికే చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ ప్రస్తావించటం ఎందుకున్న వ్యూహంతో వ్యవహరించిందో కానీ.. గురువారం జైట్లీ తన అనుభవాన్ని అంతా రంగరించి ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఆచితూచి మాట్లాడినట్లు కనిపిస్తుంది.

ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత ఇవ్వాలని అన్ని పార్టీలు పట్టుబట్టిన ఈ అంశంపై తాను స్పష్టత ఇస్తానని చెప్పిన జైట్లీ.. హోదా అన్న మాటను వాడకుండా.. వివరణ ఇచ్చేయటం గమనార్హం. విభజన చట్టంలోని అంశాల్ని అమలు చేస్తామని.. ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ప్రతి పైసాను ఇస్తామన్నారు. ఏపీకి కేంద్ర పన్ను వాట అనుకున్న దాని కంటే ఎక్కువ వచ్చిందన్న జైట్లీ.. విభజన చట్టం ప్రకారం ఇప్పటివరకూ ఏపీకి రూ.6403 కోట్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

తొలి ఏడాది ఏపీ రెవెన్యూ లోటు కింద కేంద్రం ఇచ్చింది రూ.2800 కోట్లుగా స్పష్టం చేశారు. పోలవరం విషయంలో స్పష్టత ఇచ్చిన ఆయన.. కేంద్రం ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఒడిశా సభ్యులు అడ్డు తగలగా.. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి పోలవరం పనుల్ని పూర్తి చేస్తామని జైట్లీ వెల్లడించటం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే నిధుల్ని కేంద్రం భరిస్తుందని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పటం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా లేదన్న విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. కేంద్ర సాయం గురించి ఏపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జైట్లీ మాటను చూస్తే.. సిన్హా ప్రకటన రేపిన నిరసన వేడి మోడీ సర్కారును తాకినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా మీద స్పష్టమైన ప్రకటన చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా తన వివరణను జైట్లీ పూర్తి చేయటం గమనార్హం.
Tags:    

Similar News