వైసీపీ, టీడీపీ రెండూ ఒకటేనా ?

Update: 2021-08-22 05:40 GMT
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లోని కొందరి నేతల్లో ఒకేరకమైన అసంతృప్తి ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.   వైఎస్సార్ కాంగ్రెస్  లో చూస్తేనేమో  తెలుగుదేశం పార్టీ   నుంచి వచ్చిన వారికి, మొన్నటి ఎన్నికల్లో  వైఎస్సార్ కాంగ్రెస్  కి వ్యతిరేకంగా పనిచేసిన వారికే ఇపుడు పనులు జరుగుతున్నాయని, కిరీటం దక్కుతోందంటు కొందరు  వైఎస్సార్ కాంగ్రెస్  నేతలు గోల చేస్తున్నారు. వైసీపీకి మద్దతుగా నిలబడే సోషల్ మీడియా గ్రూపుల్లో అయితే ఇదే పెద్ద ఇష్యూగా వాద, ప్రతివాదనలు జరుగుతున్నాయి.

ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నేతలను తీసుకుంటే మొదటి నుండి పార్టీలో పనిచేసిన వారిని అధినేత చంద్రబాబు నాయుడు దూరం పెట్టారంటూ కొందరు నేతలు గగ్గోలు పెడుతున్నారు. రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే విధమైన వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గోరంట్ల వాదనతో చాలామంది నేతలు గొంతు కలుపుతున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో సీనియర్ నేత, కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ కూడా చంద్రబాబు నాయుడుపై ఇదే విధమైన ఆరోపణలు చేశారు.

మొన్నటి ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీ కమిటీల్లో పదవులు కట్టబెట్టడం ఏమిటంటూ  ఆర్సీ మండిపోయారు. పార్టీ కమిటీలో పదవులు ఇచ్చేటపుడు స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఆర్సీ అడిగినట్లుగా స్ధానిక నేతల అభిప్రాయాలను తీసుకుని కమిటీలో పదవులు ఇవ్వాలంటే ఏ పార్టీకి కూడా సాధ్యంకాదు. కాకపోతే పార్టీ కోసం కష్టపడుతున్నవారు ఎవరు ? పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారెవరు ? అనే విషయాలను తెలుసుకోవటంలో తప్పులేదు.

మొత్తానికి రెండు పార్టీల్లోని నేతలను కదిలిస్తే తమ నాయకత్వాలపై ఒకేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలను లాక్కోవటం, వారిలో నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించటం లాంటి విషయాలను గోరంట్ల+కొందరు నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులకు జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీ పదవి ఇవ్వటంపై వైసీపీలో కొందరు నేతలు మండుతున్నారు.  తోట  టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ నేతలను ఎంత ఇబ్బందులకు గురిచేశారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
Tags:    

Similar News