సాఫ్ట్‌వేర్ జీతాలూ సరిపోలేదా?.. కట్న పిశాచికి మరో యువ టెకీ బలి!
హైదరాబాద్ నగరంలో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కట్న వేధింపుల రక్కసికి బలైపోయింది.;
హైదరాబాద్ నగరంలో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కట్న వేధింపుల రక్కసికి బలైపోయింది. చదువుకున్న వారు.. సమాజంపై అవగాహన ఉన్న వారు కూడా కట్నం అనే సామాజిక జాడ్యానికి బానిసలై తోటి ప్రాణాలను బలితీసుకోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కాలయముడిగా మారిన ఈ విషాద ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ప్రేమ నుంచి ప్రాణం తీసే వరకు..
బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్ (26) అనే యువతి నగరంలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెకీగా పనిచేస్తోంది. 2020లో సోషల్ మీడియా వేదికగా మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ తమ తమ అభిరుచులను పంచుకున్నారు. కొంతకాలం పాటు ఇద్దరూ కలిసి లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండి.. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఉన్న బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో అంతా సవ్యంగానే సాగుతుందని భావించినప్పటికీ కొద్ది నెలలకే నీరజ్ అసలు స్వరూపం బయటపడింది.
వేధింపులకు కారణం ‘స్టార్టప్’ కలలు
నీరజ్ బన్సాల్ సొంతంగా ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. దానికి అవసరమైన పెట్టుబడి కోసం ఇషికాను వేధించడం మొదలుపెట్టాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని.. ఆ డబ్బుతో తన వ్యాపారాన్ని విస్తరిస్తానని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ముందుగా మాటలతో వేధించిన నీరజ్.. ఆ తర్వాత శారీరక హింసకు కూడా దిగాడని తెలుస్తోంది. కేవలం నీరజ్ మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులు కూడా ఇషికాను మానసికంగా వేధించేవారని సమాచారం. చదువుకున్న అమ్మాయి, స్వతంత్రంగా బ్రతుకుతున్న వ్యక్తి కావడంతో ఈ అవమానాలను ఎవరికీ చెప్పుకోలేక ఇషికా లోలోపల కుమిలిపోయింది.
అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య
గురువారం నాడు ఇషికా తన ఫ్లాట్‌లోని హాల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు
మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నీరజ్ బన్సాల్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ల ప్రకారం వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాల కింద విచారణ జరుపుతున్నారు. ఇషికా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమె చివరిసారిగా ఎవరితో మాట్లాడింది? ఆత్మహత్యకు ముందు ఎవరికైనా మెసేజ్ చేసిందా? అనే కోణంలో విశ్లేషిస్తున్నారు.
సమాజానికి హెచ్చరిక
ఈ ఘటన నేటి తరం యువతకు, తల్లిదండ్రులకు అనేక ప్రశ్నలను మిగిల్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆర్థిక విషయాల్లో విభేదాలు వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోలేకపోవడం మైనస్ గా మారింది.. ఐటి రంగంలో లక్షల జీతాలు తీసుకుంటున్నప్పటికీ అదనపు కట్నం కోసం పాకులాడటం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. వేధింపులు ఎదురైనప్పుడు అత్తింటి వారు అండగా నిలవాల్సింది పోయి.. వేధింపులకు సహకరించడం నేరప్రవృత్తిని పెంచుతోంది.
ఇషికా మృతితో ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆశపడ్డ తల్లిదండ్రులకు ఈ వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని లోతైన విచారణ జరుపుతున్నారు.