బైక్‌ పైనే ఏపీ మంత్రి టూర్‌

Update: 2019-08-09 09:14 GMT
అధికారం వస్తే ఎక్కువ శాతం నేతలు ప్రజలు మధ్యన ఉండరు. ఇక మంత్రులు గురించి అయితే పెద్దగా చెప్పనక్కర్లేదు. పాలన వ్యవహారాల్లో బిజీగా గడపడం వల్ల కొందరికి ప్రజల దగ్గరకి వెళ్లే సమయం తక్కువ ఉంటుంది. అయితే ఏపీలో ఒక మంత్రి మాత్రం ఒకవైపు పాలన వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపు ప్రజా సమస్యలని తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అది కూడా పెద్ద పెద్ద కార్లలో వెళితే వర్కౌట్ కాదని, సామాన్యుడిలా బైక్ మీద వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు.

కాలనీ కాలనీ తిరిగి సమస్యలు తెలుసుకుంటున్న నాయకుడు మరెవరో కాదు దేవాదాయ శాఖ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. బైక్ మీద పర్యటిస్తూ..నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాగే ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని అధికారులని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని గట్టు వెనుక ప్రాంతం 29వ డివిజన్‌లోని పలు ప్రాంతాలను వెల్లంపల్లి పరిశీలించారు.

విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఏరియా అంతా చాలా చిన్న చిన్న విధుల‌తోనే నిండి ఉంటుంది. విజ‌య‌వాడ‌లోని వ‌న్ టౌన్ ఏరియా అంతా ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకే వ‌స్తుంది. అందుకే అక్క‌డ కార్ల‌తో చ‌కచ‌కా తిరిగాలంటే కుద‌ర‌దు. అందుకే వెల్లంప‌ల్లి చిన్న స్కూటీ మీద ప్ర‌తి విధిని ట‌చ్ చేస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వాటి ప‌రిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తూ ముందుకు సాగారు.

రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చూసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. వర్షకాలం కావడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాజకీయాలకు అతీతంగా పనులు చేయాలని అన్నారు. అయితే మంత్రే స్వయంగా వచ్చి తమ సమస్యలని తెలుసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News