ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. అక్రమ నిర్బంధాలు సాధారణ అంశమా?

Update: 2020-12-17 05:35 GMT
ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. వ్యక్తుల్ని ఎత్తుకెళ్లి నిర్బంధించటాన్ని తీవ్రంగా పరిగణించింది. రాజ్యాంగం ప్రసాదించిన  ప్రాథమిక హక్కుల్ని హరించే తీరును కడిగిపారేసింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించటం.. సీఆర్పీసీ నిబంధనల్ని ఉల్లంఘించటం పోలీసులకు సాధారణ విషయం ఏమో కానీ.. కోర్టుకు కాదన్న కీలక వ్యాఖ్యను చేసింది.

ఈ సందర్భంగా పోలీసుల తీరును తీవ్రంగా ప్రశ్నించింది. ‘‘ఒక వ్యక్తిని వారం పాటు అక్రమంగా నిర్బంధించి.. చిత్రహింసలకు గురి చేశారు..హైకోర్టులో కేసు వేసిన తర్వాతే విడుదల చేస్తారా? పౌరుల హక్కులకు రక్షణ కల్పించలేనప్పుడు హైకోర్టు జడ్జిలుగా మేం ఉండి ఉపయోగం ఏమిటి?’’ అని నిలదీసింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తున్నారంటూ పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు నిరసన తెలిపేందుకు కార్యక్రమాల్ని నిర్వహించాలని ప్రయత్నిస్తే పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ రాకేశ్ కుమార్.. జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ప్రభుత్వ.. పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టును కూడా బెదిరిస్తున్నారంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాధారణ పద్దతిలో విచారణ చేయాలన్న సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రాథమిక హక్కుల్ని హరించటం సాధారణ విషయమా? అని ప్రశ్నించింది.

ఈ సందర్భంగా కల్పించుకున్న ప్రసాద్.. హైకోర్టులో నమోదైన హెబియస్ కార్పస్ పిటిషన్లలో చిత్రహింసకు సంబంధించిన ఘటనలు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అలా చిత్రహింస ఘటనలు ఎక్కడా  జరగలేదని మీరు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అని ప్రశ్నించగా.. తామెందుకు దాఖలు చేస్తామన్నారు. మొత్తంగా వాదోపవాదల వేళ.. సీనియర్ న్యాయవాది ప్రసాద్.. పలు అంశాల్లో ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని విబేదించారు. ఈసందర్భంగా ధర్మాసనం మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
Tags:    

Similar News