బ్రేకింగ్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

Update: 2020-07-06 06:30 GMT
దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించిన సీఎం జగన్ అర్థాంతరంగా ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని మరోసారి వాయిదా వేశారు. గతంలోనూ ఒకసారి ఈ ప్రక్రియ వాయిదా పడగా.. మరోసారి వాయిదా పడడం నిరాశకు గురిచేస్తోంది.

ఎల్లుండి వైఎస్ఆర్ జయంతి కావడంతో తమకు ఇళ్ల పట్టాలు పంపిణీ అవుతాయని పేదలు ఆశపడ్డారు. అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి బాగా పెరిగిన నేపథ్యంలో మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది.

ఏపీ వ్యాప్తంగా జూలై 8న అన్ని జిల్లాల్లోనూ ఒకేసారి 30లక్షల మందికి పైగా పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలో పేదలకు పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు. కానీ తాజాగా వాయిదావేశారు.

ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా ఒకేసారి గుంపుగా చేరే అవకాశం ఉందని.. తద్వారా కరోనా విస్తృతంగా వ్యాపిస్తుందనే ప్రమాదం కారణంగానే  ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కాగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మరో ముహూర్తాన్ని సర్కార్ పెట్టింది.
Tags:    

Similar News