బదిలీ పై సంచలన వ్యాఖ్యలు.... ఆ ఐపీఎస్ అధికారికి షోకాజ్ నోటీసులు !

Update: 2020-07-16 06:15 GMT
ఈ మద్యే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన మాదిరెడ్డి ప్రతాప్ పై ఏపీ ప్ర‌భుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ని ఆర్టీసీ ఎండీ పదవి  నుండి  ఏపీఎస్పీ బెటాలియన్ డిజీ గా బదిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ,  పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎస్ అధికారి  మాదిరెడ్డి ప్రతాప్...మాజీ సీఎం, దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి వీరవిధేయుడిగా పేరుతెచ్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో  ఐటీ, ఇన్ ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రభుత్వానికి మంచి పేరు కూడా తెచ్చిపెట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, కొన్ని కారణాల వల్ల...జగన్ సర్కార్  ఆయనపై బదిలీ వేటు వేసింది.

ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌ల నుండి తప్పుకునే సమయంలో  మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై పలు  కీల‌క కామెంట్స్ చేశారు.
తన బదిలీని ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని, అసంతృప్తి వ్యక్తం చేస్తూనే స్వాగతిస్తున్నానని అన్నారు. వైఎస్ హయాంలో ఐటీ కార్యదర్శిగా పనిచేశానని, అప్పటి అధికారులపై అనేక దర్యాప్తులు జరిగి సీబీఐ కేసులు నమోదయ్యాయని, తనపై మాత్రం ఒక్క దర్యాప్తు కూడా లేదని, తన నిబద్దత , నిజాయితి అది అంటూ మాదిరెడ్డి ప్రతాప్ చేసిన వ్యాఖ్యల పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో రాష్ట్ర   సీఎస్ నీలం సాహ్నీ ఆయనకి  షోకాజ్ నోటీసు జారీ చేశారు. అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపింది. అలాగే ,  ఇచ్చిన సమయం లోపల అలా మాట్లాడటానికి గల కారణాలు చెప్పకుంటే క్ర‌మ‌శిక్ష‌ణా చర్యలు తప్పవని వెల్ల‌డించారు.

 అసలు ఆయన్ని ఆర్టీసీ ఎండీ పదవి నుండి ఎందుకు బదిలీ చేసారు అంటే ...   ఎలక్ట్రిక్ బస్సులు, డబుల్ డెకర్ బస్సుల కొనుగోలు ప్రతిపాదనలు, కరోనా పేరుతో 7 వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు వంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నవే . సీఎంవో అనుమతి లేకుండానే ఈ నిర్ణయాలు అన్నీ తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారన్న ఆరోపణలు ఆయన పై వచ్చాయి. దీనితో ప్రభుత్వం ఆయన్ను ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా తాజాగా బదిలీ చేసింది.
Tags:    

Similar News