పవన్ ప్రభావం : పదే పదే తలుస్తున్న జగన్....?

Update: 2022-05-16 12:30 GMT
ఎవరైనా ఎవరినైనా తలచుకుంటున్నారు అంటే అది ప్రేమ తో అయినా ఉండాలి. లేదా తమకు వారితో వైరం అయినా ఉండాలి. ఇక రాజకీయ వైరాలు ఎపుడూ ఉంటాయి. అయినా కొన్నిసార్లు లైట్ తీసుకుంటారు. కొందరి విషయం అసలు పట్టించుకోరు. పవన్ విషయం కూడా మొదట్లో వైసీపీ అలాగే అనుకుంది. కానీ పవన్ పొలిటికల్ గా  సరైన డైరెక్షన్ లో వెళ్తున్నారు అని అర్ధమవుతోంది. అంతే కాదు వైసీపీ సర్కార్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అని కూడా తెలుస్తోంది.

అందుకే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పవన్ని పదే పదే తలచుకున్నారు. దత్తపుత్రుడు అంటూ ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారు. ఈ దత్తపుత్రుడు నాడు చంద్రబాబు ఏలుబడిలో ఆయన్ని కనీసంగా కూడా ప్రశ్నించలేదని కూడా ఫైర్ అయ్యారు. ఈ పెద్ద మనిషి ఇపుడు రైతు పరామర్శ యాత్ర అంటూ బయల్దేరారు అని నిప్పులు చెరిగారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రైతు  యాత్రపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ  దత్తపుత్రుడు చంద్రబాబు ఏలుబడిలో ఎక్కడా కనిపించలేదు, నాడు అవసరమైనప్పుడు చంద్రబాబును నిలదీయలేదు అని కూడా జగన్  వ్యాఖ్యానించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం అందలేదు అని నిరూపించలేకపోయారు అని జగన్ చెప్పుకున్నారు.

అయితే పవన్ అంటున్నది వేరు. అది జగన్ కి అర్ధమైనా కూడా ఆయన దాన్ని మాత్రం ప్రస్థావించలేదు. పవన్ కౌలు రైతుల పరామర్శ యాత్ర చేపట్టారు. కౌలు రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం అందడం లేదు అని ఆయన అంటున్నారు.
కౌలు రైతులకు పాస్ పుస్తకాలు ఉండవు. వారి పేరి మీద అధికారిక పత్రాలు ఉండవు. అలాంటి వారే అసలైన రైతులుగా పొలాల్లో పనిచేస్తున్నారు. వారే అన్ని విధాలుగా పంట నష్టపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మరి పవన్ వాదిస్తున్నది, చెబుతున్నది వేరుగా ఉంటే సీఎం మాత్రం అందరికీ న్యాయం చేశామని అంటున్నారు. దాని మీదనే జనసేన తప్పు పడుతోంది. కౌలు రైతులను గుర్తించి వారికి కూడా నష్టపరిహారం ఇమ్మంటోంది.  ఇవన్నీ ఇలా ఉంటే పవన్ పరామర్శ యాత్ర సెగ మాత్రం జగన్ సర్కార్ కి బాగానే తగిలింది కాబట్టే ఆయన పదే పదే దత్తపుత్రుడు అంటూ మాట్లాడారని అంటున్నారు. ఇక తన ప్రభుత్వం రైతులకు చేసిన మేలు గురించి జగన్ చెప్పుకుంటూనే వీరంతా మంచిని చూడరని కూడా ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.

ఇక తన మూడేళ్ళ ప్రభుత్వంలో రాష్ట్రంలో కరువు లేదని కూడా జగన్ చెప్పుకున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 16 లక్షల టన్నులకు పెరిగింది. వడ్డీలేని రుణాల కోసం ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.782 కోట్లు మాత్రమే చెల్లించగా వైసీపీ ప్రభుత్వం రూ.1282 కోట్లు చెల్లించింది అని కూడా ఆయన పేర్కొన్నారు. అదే విధంగా  ఏ పంట సీజన్‌లో నష్టపోయినా అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తామని కూడా వెల్లడించారు.
Tags:    

Similar News