మతిస్థిమితం కోల్పోయిన మరో ఆర్టీసీ కార్మికుడి మృతి

Update: 2019-11-14 11:45 GMT
ఆర్టీసీ సమ్మెతో విషాదాలు కొనసాగుతున్నాయి. సమ్మెకు ముగింపు పలుకకపోవడంతో కలత చెందుతున్న కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 20 మంది వరకు మృత్యువాత పడగా.. తాజాగా మరో కార్మికుడు తీవ్ర మనస్థాపంతో తనువు చాలించాడు.

నవంబర్ 5లోపు చేరాలని కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ చూసి కలత చెందిన  సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వరరావు తీవ్ర డిప్రెషన్ కు గురై మతిస్తిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి నాగేశ్వరరావు నవ్వుతూ, ఏడుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.

కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గురువారం పరిస్థితి విషమించి నాగేశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నాగేశ్వరరావు నారాయణ ఖేడ్ డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా చేస్తున్నాడు. నాగేశ్వరరావు మృతితో పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడింది. ప్రస్తుతం రెండు నెలలుగా జీతాలు లేక అద్దెకట్టేలేని స్థితిలో  వీరి ఫ్యామిలీ ప్రస్తుతం అత్తవారింట్లో తలదాచుకుంటోంది.

ఇలా మరో కలిచివేసే చావు ఆర్టీసీ సమ్మెలో చోటుచేసుకుంది. అటు ఆర్టీసీ సంఘాలు, ఇటు సీఎం కేసీఆర్ పట్టుదలల మధ్య పాపం కార్మికులు బలైపోతున్న దైన్యం తెలంగాణలో కలిచివేస్తోంది. ఇప్పటికైనా ఈ సమ్మెకు ముగింపు లేకపోతే ఇంకా ఎన్ని ప్రాణాలు పోతోయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News