ఏపీ అసెంబ్లీ...చాలా హాట్ గురూ...

Update: 2015-08-30 06:17 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ వ‌ర్షాకాల సమావేశాలకు వేళయింది. అధికార, ప్రతిపక్షాలు సమరానికి సిద్ధమవుతున్నాయి. ప్ర‌తిపక్షాల‌ను ధీటుగా తప్పికొట్టాలని అధికార‌ టీడీపీ...ప్రభుత్వాన్ని ఎలాగైన ఇరుకునపెట్టాలని వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులతో ఈసారి సమావేశాలు హాట్‌ హాట్‌ కానున్నాయి. ఆగష్టు 31 నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో గ‌రంగ‌రంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రతిపక్షం వైసీపీ... ఇటు అధికారపక్షం టిడిపి, బిజెపిలు సై అంటే సై అంటూ సమావేశాలకు రెడీ అవుతున్నాయి.

ప్రత్యేకహోదా, రాజధాని భూసేకరణ, పుష్కరాల తొక్కిసలాట..రైతు రుణమాఫీ అమలు, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, రైతుల అవస్థలు తదితర అంశాలు సర్కారును కలవరపెడుతున్నాయి. దీనిపై విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. ప్రతిపక్షం ప్రధానంగా లేవనెత్తే అంశాలు.. ఏ టాపిక్‌ పై ఎవరు స్పందించాలి? ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలన్న దానిపై చంద్రబాబు మంత్రులకు పూర్తిగా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోఉన్న అనేక సమస్యలు ఈ పార్టీకి ఆయుధంగా మారనున్నాయి. ప్రభుత్వ హామీల అమలుపై సర్కారును నిలదీయాలని జగన్‌ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ సమస్యలపై ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడిపెంచాలని జగన్‌ ఇప్పటికే ఆపార్టీ నేతలు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం ఏర్పాటుచేసుకొని తుది నిర్ణ‌యం మార్గ‌ద‌ర్శ‌నం చేసే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News