ర‌జ‌నీ కోసం త‌ల‌పులు తెరిచే ఉంటామంటున్న షా

Update: 2017-05-24 15:36 GMT
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సొంత పార్టీ పెడతారా? బీజేపీలో చేరుతారా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు తెలుస్తుండగా, రజనీకి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర  మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా బీజేపీ చీఫ్ అమిత్‌ షా వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. రజనీకాంత్ కోసం ఎల్లప్పుడూ తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.

రజనీ కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ త‌లుపులు తెరిచే ఉంచుతోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరే విషయంపై సూపర్ స్టార్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాల‌ని అన్నారు. తమిళనాడులో త‌మ పార్టీ బలహీనంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సూపర్ స్టార్ రజినీకాంత్ వ‌స్తే రాష్ట్రంలో పార్టీ బలపడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు సుపరిపాలనపై త్వరలోనే తమిళనాడులో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కాగా, రజనీ చాలా ఏళ్లుగా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నా, అవి రాజకీయపరమైనవి కావని తమిళనాడుకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎల్ గణేశన్ అభిప్రాయపడ్డారు.``మొదట ఆయన్ను రాజకీయాల్లోకి రావాలో వద్దో తేల్చుకోనివ్వండి.. కానీ బీజేపీ మాత్రం సరైన వ్యక్తుల కోసం ఎదురుచూస్తోంది`` అని ఆయన వ్యాఖ్యానించారు. రజనీ ప్రజల నాడి తెలుసుకునేందుకే వ్యవస్థలో మార్పు ప్రకటన చేసి ఉండొచ్చుననే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఇదిలాఉండ‌గా...తలైవా రాజకీయ ప్రవేశంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, ఏఐఏడీంకేలోని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామిలాంటి నాయకుల జాతకాలు తారుమారయ్యే అవకాశాలుంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవైపు జయలలిత మృతి, మరోవైపు రాజకీయాల నుంచి కరుణానిధి నిష్క్రమణ నేపథ్యంలో రజనీకాంత్, తమిళనాడు రాజకీయాల్లో నాలుగైదు దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు పార్టీల గుత్తాధిపత్యానికి గండికొట్టవచ్చు. డీఎంకేలో స్టాలిన్ ఇంకా తననుతాను నిరూపించుకోలేదు. ఏఐఏడీఎంకే రెండుగా చీలిపోయింది. ఈ తరుణంలో రజనీకాంత్ బీజేపీలో చేరితే ఆ పార్టీకి లాభించవచ్చు అని తమిళనాడు రచయిత, పాత్రికేయుడు సుధాగన్ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రజనీ తీసుకోబోయే నిర్ణయం, తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులకు దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Tags:    

Similar News