తమిళనాడుకు అమిత్ షా.. రజినీతో భేటి?

Update: 2020-11-17 01:30 GMT
కేంద్రహోంశాఖ మంత్రి, బీజేపీలో నంబర్ 2 అయిన అమిత్ షా ఈనెల 21న తమిళనాడు పర్యటనకు వస్తుండడం రాజకీయాలను వేడెక్కిస్తోంది. వచ్చే ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తి రేపుతోంది.

అమిత్ షా తన పర్యటనలో పార్టీ సీనియర్ నేతలు, జిల్లా కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు వ్యూహరచన చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెట్రివేల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అమిత్ షా పర్యటన మరింత  ఉత్సాహాన్ని నింపనుంది.

ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి బలంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అధికార అన్నాడీఎంకేలో అనిశ్చితి కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే బీజేపీ నాయకత్వంలోనే మరో మెగా కూటమి ఏర్పాటు అవుతుందని బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు మురగన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే అమిత్ షా  చిన్నా చితక పార్టీలతో కలిసి ఉమ్మడి కూటమిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్ధేశం చేయనున్నారు.

ఈనెల 21న రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్ షాతో చెన్నైలో సూపర్ స్టార్ రజినీకాంత్ కలుసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీకి మద్దతుగా మాట్లాడే రజినీకాంత్ మద్దతును తమిళనాడు ఎన్నికల్లో పొందాలని అమిత్ షా భావిస్తున్నట్టు తెలుస్తోంది. రజినీకాంత్ తో భేటి జరిగితే బీజేపీకి తమిళనాట లాభం జరుగుతుందని అమిత్ షా ఈ భేటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News