అంతరిక్ష ప్రయాణాల్లో కొత్త ఆశలు: `వార్ప్ బబుల్` ప్రయోగం సక్సెసైతే!
సుదూర నక్షత్ర మండలానికి చేరుకోవాలనే మానవుని కలలకు `వార్ప్ డ్రైవ్` సిద్ధాంతం ఎప్పుడూ కొత్త ఊపిరి పోస్తూనే ఉంటుంది.;
సుదూర నక్షత్ర మండలానికి చేరుకోవాలనే మానవుని కలలకు `వార్ప్ డ్రైవ్` సిద్ధాంతం ఎప్పుడూ కొత్త ఊపిరి పోస్తూనే ఉంటుంది. తాజాగా అంతరిక్ష శాస్త్రవేత్త హెరాల్డ్ సన్నీ వైట్ .. అతని బృందం ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ఈ దిశగా ఒక ఆసక్తికరమైన మలుపును తీసుకొచ్చింది. విశ్వంలోని కాంతి వేగ పరిమితిని దాటకుండానే అంతరిక్ష నౌకను వేగంగా ముందుకు తీసుకెళ్లగలిగే `వార్ప్ బబుల్` రూపకల్పనలో వారు కొన్ని మార్పులను ప్రతిపాదించారు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే స్టార్‌షిప్ ఎంటర్‌ప్రైజ్ ఇంజన్ల నిర్మాణాన్ని పోలి ఉండటం విశేషం.
సాధారణంగా ఏదైనా వస్తువు కాంతి వేగంతో ప్రయాణించాలంటే అనంతమైన శక్తి అవసరమవుతుంది.. ఇది భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం అసాధ్యం. అయితే వార్ప్ డ్రైవ్ సిద్ధాంతం నౌకను వేగంగా నడపడం కంటే.. నౌక ప్రయాణించే దారిని మార్చడంపై దృష్టి పెడుతుంది. అంటే నౌక ముందున్న అంతరాళాన్ని కుదించి.. వెనుక ఉన్న అంతరాళాన్ని విస్తరించడం ద్వారా ఒక బుడగలాంటి ప్రాంతాన్ని సృష్టిస్తారు. ఇది విమానాశ్రయాల్లో ఉండే `మూవింగ్ వాక్-వే` లాంటిది.. మీరు పరిగెత్తకపోయినా కింద ఉన్న దారి కదలడం వల్ల మీరు వేగంగా గమ్యాన్ని చేరుకుంటారు.
ఈ కొత్త పరిశోధనలో శాస్త్రవేత్తలు `ఇంటీరియర్-ఫ్లాట్` అనే నమూనాను ప్రతిపాదించారు. గతంలో ప్రతిపాదించిన వార్ప్ బబుల్స్‌లో లోపల ఉన్న వ్యోమగాములకు తీవ్రమైన గురుత్వాకర్షణ ఒత్తిడి ఎదురయ్యే ప్రమాదం ఉండేది. కానీ ఈ కొత్త డిజైన్‌లో బుడగ వెలుపల అంతరిక్షం వంగి ఉన్నా నౌక లోపల మాత్రం స్థలం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల నౌకలోని క్లాకులు.. భౌతిక నియమాలు యథాతథంగా పనిచేస్తాయి. ఇది భవిష్యత్తులో వ్యోమగాముల భద్రతకు అత్యంత కీలకం.
అయితే ఈ అద్భుతమైన ఇంజన్‌ను నిర్మించడంలో ప్రధాన అడ్డంకి `నెగటివ్ ఎనర్జీ`. ఈ వార్ప్ బబుల్‌ను సృష్టించాలన్నా.. స్థిరంగా ఉంచాలన్నా విశ్వంలో మనకు తెలియని ఒక రకమైన విదేశీ శక్తి కావాలి. క్వాంటం స్థాయిలో దీని ఉనికి కొంతవరకు సాధ్యమైనా ఒక అంతరిక్ష నౌకను నడిపే స్థాయిలో దీనిని సేకరించడం ప్రస్తుతానికి అసాధ్యమని హార్వర్డ్ ఖగోళ శాస్త్రవేత్త అవి లోబ్ వంటి వారు అభిప్రాయపడుతున్నారు. నెగటివ్ ఎనర్జీ సమస్య పరిష్కారం కానంత వరకు.. వార్ప్ డ్రైవ్ అనేది కేవలం కాగితంపై ఉన్న అద్భుతమైన మ్యాథ్స్ ఈక్వేషన్ గానే మిగిలిపోతుంది.
ఈ పరిశోధనలు తక్షణమే మనల్ని ఇతర నక్షత్రాలకు తీసుకెళ్లలేకపోవచ్చు కానీ ఇవి సైన్స్ ఫిక్షన్ నుంచి విజ్ఞాన శాస్త్రం వైపు వేస్తున్న అడుగులు అని భావించాలి. నౌకను ఎలా నియంత్రించాలి? ..ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలి? అనే ఇంజనీరింగ్ ప్రశ్నలకు ఇవి సమాధానాలు వెతుకుతున్నాయి. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సబైన్ హోసెన్‌ఫెల్డర్ అన్నట్లుగా.. ఈనాటి సిద్ధాంతాలు ఆచరణలోకి రావడానికి 1000 లేదా 5000 ఏళ్లు పట్టవచ్చు. ఏది ఏమైనా... విశ్వం అంచులను తాకాలనుకునే మానవుని జిజ్ఞాసకు వార్ప్ డ్రైవ్ ఒక ఆశావహ కిరణంలా కనిపిస్తోంది.