ప‌వ‌ర్ పొగ‌రు షా త‌ల‌కు ఎక్కేసిందా?

Update: 2017-08-14 18:25 GMT
రాజ‌కీయాల్లో ఎంత ఒద్దిగ్గా ఉంటే అంత బాగుంటుంది. తొంద‌ర‌ప‌డి ఒక్క మాట అన్నా వెన‌క్కి తీసుకోలేం. విప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి కంటే అధికారంలో ఉన్న‌ప్పుడు మాట్లాడే విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత‌గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకోవ‌చ్చు. ఈ సింఫుల్ సూత్రాన్ని చాలామంది రాజ‌కీయ నేత‌లు మ‌ర్చిపోతుంటారు.

మామూలు రాజ‌కీయ నేత‌లు ఇలాంటి త‌ప్పులు చేయ‌టాన్ని కొంత మేర అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. పోటుగాడు.. మొన‌గాడు..వ్యూహ‌నిపుణుడు.. లెక్కేసి మ‌రీ ప్ర‌త్య‌ర్థికి చుక్క‌లు చూపించే తెలివైనోడు అంటూ ర‌క‌ర‌కాల ఉప‌మానాల‌తో పొగిడేసే అమిత్ షా లాంటోళ్ల మాట‌లు ఉంటేనే అస‌లు ఇబ్బందంతా. గోర‌ఖ్ పూర్ విషాద ఉదంతంలో ఎవ‌రెన్ని చెప్పినా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని.. యోగి స‌ర్కారు త‌ప్పుల్ని నిందించ‌క త‌ప్ప‌దు. ఎవ‌రు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా ప‌దుల సంఖ్య‌లో పిల్ల‌లు పోగొట్టుకున్న త‌ల్లుల గ‌ర్భ‌శోకం బీజేపీ స‌ర్కారుకు తాక‌క త‌ప్ప‌దు.

ఊహించ‌నిరీతిలో విషాదం చోటు చేసుకున్న వేళ‌.. వీలైనంత జాగ్ర‌త్త‌గా ప‌రిస్థితిని హ్యాండిల్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు మాట జార‌టం మామూలే. అందుకే.. ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు వెనుకా ముందు చూసుకొని మాట్లాడాలి. కానీ.. ఆ విష‌యాన్ని అమిత్ షా మ‌ర్చిపోయారు.

గోర‌ఖ్ పూర్ విషాదంపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి మాట‌లు వేలెత్తి చూపించేలా ఉండ‌ట‌మే కాదు.. పుండు మీద కారం చ‌ల్లేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక పెద్ద త‌ప్పిదం జ‌రిగిన‌ప్పుడు అందుకు బాధ్య‌త‌గా రాజీనామా చేయాల‌ని కోర‌టం మామూలే. ఎవ‌రి దాకానో ఎందుకు.. బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ సంగ‌తే చూస్తే.. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు త‌న శాఖ చేసిన త‌ప్పిదానికి తాను బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవ‌టం క‌నిపిస్తుంది. అంత‌టి ఉదాత్త‌త‌ను అంద‌రి నుంచి ఆశించ‌లేం. అందులోకి ఇప్ప‌టి త‌రం బీజేపీ నేత‌ల నుంచి అలాంటివి ఊహించ‌లేం. అలా అని ఏమాత్రం బాధ్య‌త లేన‌ట్లు.. బాధ లేన‌ట్లుగా మాట్లాడ‌టాన్ని కూడా స‌హించ‌లేరు.

గోర‌ఖ్ పూర్ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ యూపీ సీఎంగా ఉన్న యోగిని రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయ‌టాన్ని అమిత్ షా తేలిగ్గా కొట్టిపారేశారు. రాజీనామా డిమాండ్ చేయ‌టం కాంగ్రెస్ ప‌నిగా ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇంత‌వ‌ర‌కూ షా మాట‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌లేం. ఇక్క‌డ నుంచే ఆయ‌న నిర్ల‌క్ష్య‌పు మాట‌లు మొద‌ల‌య్యాయి.  భార‌త్ లాంటి పెద్ద దేశంలో ఇలాంటివి మామూలేన‌ని.. గ‌తంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయ‌ని.. ఇదే మొద‌టిసారి అంటూ పవ‌ర్ త‌ల‌కెక్కిన‌ప్పుడు వ‌చ్చే మాట‌ల్ని మాట్లాడారు.

ఇక్క‌డ షా అర్థం చేసుకోవాల్సిందేమంటే.. గ‌త ప్ర‌భుత్వాలు త‌ప్పు చేశాయి కాబ‌ట్టే.. ఇప్పుడు బీజేపీకి అవ‌కాశం వ‌చ్చింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. వారు చేసిన త‌ప్పుల్నే మేం చేస్తాం.. మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నించొద్ద‌న్న మాట‌లు మాట్లాడితే.. ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇవ్వాలో అలాంటి తీర్పు ఇవ్వ‌టం గ్యారెంటీ. ప‌సి పిల్ల‌లు పిట్ట‌ల్లా చ‌చ్చిపోయి.. తీర‌ని మ‌నోవేద‌న‌తో బాధ ప‌డుతుంటే.. ఆ వేద‌న ఏమీ త‌న మాట‌ల్లో లేకుండా బాధ్య‌తారాహిత్యంతో మాట్లాడే షా.. త‌న మాట‌ల‌కు మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. దేన్ని భ‌రించినా.. ప‌వ‌ర్ త‌ల‌కెక్కిన నేత‌ల్ని ప్ర‌జ‌లు భ‌రించ‌లేరు. ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్యం. మ‌రోసారి రిపీట్ కావాల‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తే.. ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు?
Tags:    

Similar News