క‌రోనాపై స‌మ‌రంలో అమెరికా స‌క్సెస్?

Update: 2021-05-27 09:30 GMT
క‌రోనాకు ఈ రోజు వ‌ర‌కు మందు లేదు. దీంతో.. వైర‌స్ సోక‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం..  ముంద‌స్తుగా వ్యాక్సిన్ తీసుకోవ‌డమే మార్గాలుగా ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. వ్యాక్సినే కొవిడ్ కు మందుగా భావించాల్సిన ప‌రిస్థితి. అందుకే.. ప్ర‌పంచం మొత్తం వ్యాక్సినేష‌న్ మీద‌నే దృష్టిపెట్టింది. కొన్ని దేశాలు నిర్ల‌క్ష్యానికి మూల్యం చెల్లిస్తుంటే.. కొన్ని దేశాలు మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో వ్యాక్సినేష‌న్ విజ‌యవంతంగా కొన‌సాగిస్తున్నాయి. త‌ద్వారా.. దేశాన్ని వైర‌స్ బారి నుంచి ర‌క్షించుకుంటున్నాయి.

ఇందులో ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సింది అమెరికా గురించే. తొలి ద‌శ‌లో క‌రోనా విజృంభ‌ణ‌తో వ‌ణికిపోయిన ఆ దేశం.. ఆ త‌ర్వాత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌తో కొవిడ్ ఆట క‌ట్టించేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా కొన‌న‌సాగించింది. ఆ ఫ‌లితాలు స్వ‌ల్ప‌కాలంలో క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశంలో వ్యాక్సిన్ అర్హ‌త క‌లిగిన వారిలో 50 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశారని తెలుస్తోంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అయితే.. ఏకంగా 70 శాతం మందికిపైగా ఇచ్చేశారట‌.

బైడెన్ జ‌న‌వ‌రి 20న ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆయ‌న తొలిగా ఎంచుకున్న ప్రాధ‌మ్యాల్లో.. వ్యాక్సినేష‌న్ కూడా ఒక‌టి. వంద రోజుల్లో 100 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్ వేయాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ను గ‌డువులోగానే చేరుకోవ‌డం విశేషం. దీంతో.. ల‌క్ష్యాన్ని 200 మిలియ‌న్ డోసుల‌కుపెంచారు. దాన్ని కూడా పూర్తిచేశారు. ఇది కూడా ఏప్రిల్ మ‌ధ్య‌నాటికే పూర్త‌యింది.

ఇప్పుడు 50 శాతం మందికిపైగా రెండో డోసు కూడా తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. అగ్ర‌రాజ్యం క‌రోనాపై పోరులో విజ‌యం సాధించిన‌ట్టేన‌నే విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికాలో రోజుకు న‌మోదవుతున్న కేసులు.. 20 వేల వ‌ద్ద‌నే ఉన్న‌ట్టు స‌మాచారం. ఇంకా వ్యాక్సినేష‌న్ కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆ వైపు మ‌ళ్లించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేసుల తీవ్ర‌త మ‌రింత త‌గ్గే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే.. అమెరికా కొవిడ్ ను గెలిచేసిన‌ట్టేన‌ని అంటున్నారు.
Tags:    

Similar News