బాల‌య్య‌పై అంబ‌టి ప‌వ‌ర్ పంచ్‌లు ఇవే!

Update: 2018-01-25 11:34 GMT
వైసీపీ అధికార ప్ర‌తినిధి, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న అంబ‌టి రాంబాబు... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో పాటు ఆయ‌న బావ‌మ‌రిది, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ల‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. నిన్న చంద్ర‌బాబు ఛాంబ‌ర్‌ లో లేపాక్షి ఉత్స‌వాల‌కు సంబంధించిన స‌మీక్ష నిర్వ‌హించిన బాల‌య్య‌... చంద్ర‌బాబు కూర్చునే ప్రాంతంలోనే వేరే కుర్చీ వేసుకుని కూర్చున్న విష‌యం తెలిసిందే క‌దా. ఈ విష‌యంపై నిన్నంతా ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు ప్ర‌సార‌మ‌య్యాయి. బాల‌య్య సీఎం కుర్చీలో కూర్చున్నార‌ని, ఇక బాబు త‌ర్వాత బాల‌య్యే సీఎం అని కూడా కొంద‌రు వ్యాఖ్యానించారు. అయితే ఈ స‌మీక్ష నిర్వ‌హ‌ణ‌లో త‌ప్పేమీ లేద‌ని, ఓ ఎమ్మెల్యే స్థాయిలో బాల‌య్య అదికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించార‌ని, అయినా ఆయ‌న కూర్చున్న‌ది సీఎం కుర్చీ కాద‌ని సీఎంఓ అధికారుల‌తో పాటు టీడీపీ నేత‌లు కూడా మీడియా అడ‌గ‌కుండానే ముందుకు వ‌చ్చి మ‌రీ చెప్పేశారు. సీఎం కూర్చునే కుర్చీ కాక‌పోయినా... సీఎం కూర్చునే స్థానంలో ఇత‌రులు కూర్చోవ‌చ్చా? అన్న ప్ర‌శ్న‌కు అటు అధికారుల నుంచే కాకుండా ఇటు టీడీపీ నేత‌ల నుంచి కూడా స‌మాధానం రాలేదు.

ఈ ఎపిసోడ్‌పై మాట్లాడేందుకు నేటి మ‌ధ్యాహ్నం మీడియా ముందుకు వ‌చ్చిన అంబ‌టి రాంబాబు... బాల‌య్య వ్య‌వ‌హారంతో పాటుగా బాబు తీరుపైనా నిప్పులు చెరిగారు. ఓ ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య‌... త‌న బావ అయిన చంద్ర‌బాబు కూర్చునే స్థ‌లంలోనే ఠీవి వెల‌గ‌బెట్టిన వైనాన్ని ప్ర‌స్తావించిన అంబ‌టి జ‌నానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. సీఎం కుర్చీలో కూర్చున్న బాల‌య్య‌ను వారించాల్సిన అధికారులు, మంత్రి దేవినేని.... బాల‌య్య చేతిలో దెబ్బ‌లు తినాల్సి వ‌స్తుందేమోన‌న్న భ‌యంతోనే ఆయ‌న‌ను వారించ‌లేదా? అని కూడా అంబ‌టి ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి కుర్చీని ఎమ్మెల్యే బాలకృష్ణ అవమానించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో సంప్రదాయాలను గౌరవించాలని ఆయ‌న‌ అన్నారు. బాలకృష్ణ తీరు చూస్తుంటే ఏపీలో పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. పక్కన ఉండి కూడా బాలకృష్ణను మంత్రులు, అధికారులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కొందరు టీడీపీ నేతలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. నిన్నటి వరకు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని, ఆయన దొడ్డదారిన మంత్రి అయ్యారని, ఇప్పుడు లోకేశ్ మామ బాల‌య్య ఆయ‌న మాదిరే త‌యార‌య్యార‌ని విరుచుకుప‌డ్డారు. బావమరిది మీద ప్రేమ ఉంటే చంద్రబాబు వెంటనే తప్పుకొని బాలకృష్ణను సీఎం చేస్తే త‌మ‌కేమీ అభ్యంతరం లేదన్నారు.

ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య సీఎం కుర్చీలో కూర్చుని ద‌ర్పం వెల‌గ‌బెడుతుంటే... సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ ప్ర‌జాస్వామ్యాన్ని కాల‌రాస్తున్నార‌ని మండిప‌డ్డారు. పార్టీ ఫిరాయించిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుంటే తాము అసెంబ్లీకి రామని చెప్పామని అంబటి రాంబాబు అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పార్టీ ఫిరాయింపులను ఖండించారని అన్నారు. పార్టీ ఫిరాయింపులు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారని చెప్పారు. మిత్రపక్షమైన బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీని ఎండగడుతోందని అంబటి అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని అన్నారు. సీఎం కుర్చీలో కూర్చొని చంద్రబాబు ఆ సీటును అపహాస్యం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఇక ఏపీలో పార్టీ ఫిరాయింపులు ఇంత జోరుగా సాగుతున్నా... ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించాల్సిన గురుత‌ర బాధ్య‌త ఉన్న వ్య‌క్తిగా గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అంబ‌టి ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్... ముఖ్యమంత్రి చంద్రబాబు భజన చేయడం సరికాదన్నారు. గవర్నర్ తీరును తాము ఖండిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నరే భజన చేస్తుంటే ఎలా అన్నారు. గవర్నర్‌ను మార్చాలని బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా డిమాండ్ చేశారని, కానీ అది అమలు కాలేదన్నారు. గవర్నర్ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మారారని అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
Tags:    

Similar News