మామ‌నే కాదు..జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ను వాడుకున్నావ్‌

Update: 2018-04-19 08:33 GMT
ఏపీలో అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం అంత‌కంత‌కూ ముదురుతోంది. హోదా సాధ‌న కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా తాను ఒక రోజు దీక్ష చేస్తానంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు మోడీ స‌ర్కారుతో భుజం భుజం రాసుకొని.. త‌ప్పుల్ని కాస్తూ.. మోడీ స‌ర్కారు మైండ్ సెట్‌ కు త‌గ్గ‌ట్లు మాట్లాడిన చంద్ర‌బాబు ఇప్పుడు అందుకు భిన్నంగా హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకోవ‌టం తెలిసిందే.

హోదా సాధ‌న కోసం మొద‌ట్నించి పోరాడుతున్న ఏపీ విప‌క్షనేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుణ్య‌మా అని ఏపీ ప్ర‌జ‌ల్లో హోదాపై సెంటిమెంట్ అంత‌కంత‌కూ రాజుకోవ‌ట‌మే కాదు.. ఈ రోజు మోడీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని గుర్తించిన బాబు.. హోదా పోరాటంపై ఇప్పుడు ఆయ‌న త‌న మాట‌ల దాడిని పెంచుతున్నారు.

మోడీ స‌ర్కారు తీరుకు నిర‌స‌న‌గా తానేదో చేస్తున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చేందుకు వీలుగా  దీక్ష‌ను ప్లాన్ చేసిన బాబు తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు తీవ్రంగా మండిప‌డుతున్నారు. నిర‌స‌న అంటూ బాబు చేసే ఒక రోజు దీక్ష కాద‌ని.. అది దొంగ‌దీక్ష అంటూ మండిప‌డ్డారు. పిల్ల‌ను ఇచ్చిన మామ‌ను వెన్నుపోటు పొడిచిన బాబు అధికారాన్ని చేప‌ట్టార‌న్నారు.

బాబు త‌న ఎదుగుద‌ల‌లో భాగంగా సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను కూడా వాడుకున్నార‌న్నారు. నాలుగేళ్లుగా సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ధ‌ర్మాన్ని ఎక్క‌డైనా కాపాడారా? అంటూ ప్ర‌రశ్నించారు. అధికారుల‌పై టీడీపీ నేత‌ల దాడులు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయ‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇది ధ‌ర్మ‌మా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న  తొలుత హోదా కంటే ప్యాకేజీ ముఖ్య‌మ‌న్నార‌ని.. ఇప్పుడు హోదా కావాల‌ని అడ‌గ‌టంలో అర్థం ఉందా? అని ప్ర‌శ్నించారు.

హోదా కోసం జపాన్ త‌ర‌హా ఆందోళ‌న అంటూ చంద్ర‌బాబు గంద‌ర‌గోళంగా మాట్లాడ‌తార‌ని.. అస‌లు జ‌పాన్ త‌ర‌హా నిర‌స‌న అంటే ఏమిటో చెప్పాల‌న్నారు. హోదా కోసం ముఖ్య‌మంత్రి చేసే దీక్ష‌కు డ్వాక్రా మ‌హిళ‌లు.. స్కూల్ పిల్ల‌లతో దీక్ష ఎలా మ‌ద్ద‌తు తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. మ‌హిళ‌లు.. పిల్ల‌ల‌కు బ‌దులుగా టీడీపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు దీక్ష‌కు రావాల‌న్న సూచ‌న చేశారు.

బాబు చేస్తున్న దీక్ష ధ‌ర్మ పోరాటం కాద‌ని.. అధ‌ర్మ పోరాట‌మ‌ని..ప్ర‌జ‌ల్ని.. ఉద్య‌మ‌కారుల్ని త‌ప్పు దారి ప‌ట్టించ‌ట‌మే బాబు ల‌క్ష్య‌మ‌న్నారు. హోదా కోసం పేప‌ర్ ఉద్య‌మాల్ని బాబు క‌ట్టిబెట్టాల‌న్నారు. బాబు త‌ప్పుల్ని ఎత్తి చూపుతూ సాగిన అంబ‌టి వ్యాఖ్య‌లు ఏపీ ముఖ్యమంత్రికి ముల్లుల్లా గుచ్చుకున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News