బాబు గారు ఇంకో నిజం చెబుతున్నారు!

Update: 2018-03-09 14:04 GMT
చంద్రబాబు నాయుడు ముందు ఇప్పుడు పాపం చాలా బాధ్యతలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో ఆయన తెగతెంపులు చేసుకున్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతందనే ఉద్దేశంతో  మాత్రమే తాను భాజపాతో కలిశానని, వాళ్లు వంచించారని.. మంచి జరుగుతుందని ఆశతోనే కేంద్రంలో మంత్రి పదవులు కూడా తీసుకున్నాం అని ఆయన పదేపదే చెబుతున్నారు. అయితే తన మాటలు ప్రజలు నమ్ముతున్నారో లేదో అని ఆయనకే అనుమానం కలిగినట్లుగా ఉంది. తాను ఎన్ని మాయమాటలు చెప్పినా సరే.. మోడీ హవా నేపథ్యంలో 2014 ఎన్నికల సమయానికి దేశవ్యాప్తంగా.. వీస్తున్న మోడీ పవనాలను క్యాష్ చేసుకోవడానికే జట్టు కట్టినట్టుగా ప్రజలు అనుమానిస్తున్నారని ఆయనకే అనిపించినట్లుంది. అందుకే తాజాగా గత ఎన్నికలలో భాజపా వల్ల తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా రాలేదని చెప్పడానికి చంద్రబాబునాయుడు ఇప్పుడు సాహసిస్తున్నారు.

అంటే.. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి పడిన ప్రతిఓటూ అచ్చంగా చంద్రబాబునాయుడు గారి ప్రతిభను చూసి.. ఆయనకు అధికారం కట్టబెట్టడం కోసమే.. తెలుగుజాతి మొత్తం ఎగబడి వేసిన ఓట్లన్న మాట. ఏపీలో భాజపాకు రెండు పార్లమెంటు సీట్లు దక్కాయంటే కూడా.. అవన్నీ తెలుగుదేశం ఓట్లే.. తెలుగుదేశానికి పడిన ఓట్ల పుణ్యమే.. హరిబాబు, గోకరాజు ఎంపీలు అయ్యారన్నమాట. ఆ విధంగా తన పార్టీ తరఫున ఓట్లు వేయించి.. ఇద్దరు ఎంపీలను కూడా ఇచ్చినందుకు, ముందునుంచి పొత్తులు పెట్టుకున్నందుకు కాకపోయినప్పటికీ.. రాష్ట్రానికి మంచి జరగడం కోసం.. ఆయన రెండు కేంద్రమంత్రి పదవులను తన పార్టీ వారికి తీసుకున్నారన్నమాట.

మరో విషయాన్ని కూడా ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. భాజపా వల్ల కనీసం ఒక్క ఓటు కూడా రాకపోయినప్పటికీ.. కేవలం చంద్రబాబునాయుడు ఎంతో సౌజన్యమూర్తి గనుక.. రాష్ట్రంలో తమకు మిత్రపక్షంగా ఉన్నందుకు భాజపా వారికి రెండు మంత్రి పదవులు తన కేబినెట్ లో ఇచ్చారు. అంతే తప్ప వారికి ప్రత్యుపకారం మాత్రం కాదు. వారిద్వారా వచ్చిందేమీ లేకపోయినా.. తనే.. పోనీ పాపం అని పదవులు ఇచ్చారన్నమాట.

ఇవన్నీ ప్రస్తుతం చంద్రబాబు గారు చెబుతున్న సంగతులు. మరి ప్రజలు వీటిని నమ్ముతున్నారా? నమ్మి.. మళ్లీ మళ్లీ చంద్రబాబునే నెత్తిన పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కట్టబెడతారా? బాబు చెప్పిన ప్రకారం.. గత ఎన్నికల్లోనే భాజపా వలన వచ్చిన ఓటు ఒక్కటి కూడా లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీకి సున్న కంటె తక్కువ ఓట్లు పడాలి కదా? అనే సందేహాలు రేగుతున్నాయి.
Tags:    

Similar News