అధినేత అంటే అలా ఉండాలి.. కార్పొరేటర్లకు అక్బరుద్దీన్ భారీ వార్నింగ్

Update: 2020-12-14 05:08 GMT
గల్లీ కార్పొరేటర్ చేసే గలీజు పనుల మీద పల్లెత్తు మాట అనేందుకు ధైర్యం సరిపోని నేతలున్న పార్టీలు చాలానే ఉన్నాయి. అందుకు భిన్నంగా సొంత పార్టీ కార్పొరేటర్లు తప్పు చేస్తే.. తాట తీస్తానని ఓపెన్ వార్నింగ్ ఇచ్చే పార్టీలు.. వాటి నేతలు ఇప్పుడు తక్కువే. ఇలాంటివేళ.. అలాంటి మాటల్ని మొహమాటం లేకుండా అనేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. మజ్లిస్ అధినేత అసద్ సోదరుడు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

గ్రేరట్ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన మజ్లిస్ కార్పొరేటర్లను.. మజ్లిస్ కార్యకర్తలతో విజయోత్సవ సభను తాజాగా హాఫీజ్ బాబానగర్లోనిఫలక్ ప్యాలస్ లోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గెలిచిన కార్పొరేటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటం గమనార్హం. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజా సేవ కోసం దేవుడిచ్చిన అవకాశంగా భావించి పని చేయాలన్నారు.

పదవుల్ని అడ్డుపెట్టుకొని వసూళ్లకు పాల్పడినట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజల్ని వేధించొద్దని స్పష్టం చేసిన ఆయన.. చాంద్రాయణగుట్ట ప్రాంతం తన రక్తం చిందిన నేల అని.. ఈ ప్రాంతం అంటే తనకెంతో మక్కువ.. ప్రాణంగా అభివర్ణించారు. చాంద్రాయణగుట్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా.. కార్పొరేటర్లు.. మజ్లిస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చిన ఆయన అక్కడితో ఊరుకోలేదు.

పదవుల్ని అడ్డుపెట్టుకొని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం.. వేధింపులకు గురి చేస్తే.. వారి కాలర్ పట్టుకొని నడి బజారులో నిలబెడతానని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీ నేతలకు ఇంతటి తీవ్ర హెచ్చరిక చేసే దమ్ము మరే పార్టీలోనూ కనిపించదేమో?
Tags:    

Similar News