ఏసర్ కు దిమ్మ తిరిగే షాక్.. తాజాగా సంస్థ సర్వర్లు హ్యాకింగ్

Update: 2021-10-16 03:24 GMT
కంప్యూటర్లు.. ల్యాప్ టాప్ లు వాడే వారికి.. టెక్ ప్రపంచంతో పరిచయం ఉన్న వారందరికి తైవాన్ కు చెందిన టెక్ దిగ్గజం ఏసర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సంస్థకు చెందిన సర్వర్ల మీద హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సైతం నిర్దారణకు రావటమే కాదు.. అధికారిక సమాచారాన్ని తన వినియోగదారులకు.. ఇతరత్రా విభాగాలకు కూడా తెలియజేసినట్లుగా చెబుతున్నారు.

దాదాపు 60 జీబీ వినియోగదారుల డేటాను తమ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా ప్రకటించారు.బ్యాడ్ లక్ అనాలో.. సంస్థలో అప్రమత్తత సరిగా లేని నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించటమా? అన్నదిప్పుడు చర్చగా మారిందని చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏసర్ కంపెనీ డేటాను దొంగలించటం రెండో సారి కావటం గమనార్హం. హిందుస్థాన్ టైమ్స్ వార్తా కథనం ప్రకారం చూస్తే.. తాజా హ్యాకింగ్ తో యూజర్ల వ్యక్తిగత సమాచారం.. కార్పొరేట్ కస్టమర్ డేటా.. సున్నితమైన ఖాతాల సమాచారం.. ఆర్థిక డేటాను యాక్సెస్ చేసినట్లుగా పేర్కొన్నారు.

దేశంలోని దాదాపు 10 వేల మంది కస్టమర్ల రికార్డుల్ని కలిగి ఉన్న ఫైళ్లు.. డేటా బేస్ వీడియోలు హ్యాకర్ల బారిన పడినట్లుగా చెబుతున్నారు. భారతదేశంలో తన స్థానిక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సిస్టమ్ పై దాడి చేసినట్లు ఏసర్ పేర్కొంది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి అనుభవనాన్ని ఎదుర్కొని.. తమ సమాచారాన్ని హ్యాకర్ల నుంచి తిరిగి పొందటానికి అప్పట్లో భారీ మొత్తాన్ని చెల్లించినట్లుగా చెబుతున్నారు. ఈసారి అయినా ఎదురవుతున్న ఇబ్బందుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటే..హ్యాకర్ల బారిన పడే ప్రమాదాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News