ఆ సీఎంపై పోటీకి ఊహించని అభ్యర్థి తెర మీదకు వచ్చారే!

Update: 2021-03-16 17:30 GMT
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సంచలనం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై పోటీకి అనూహ్య రీతిలో ఒక మహిళ పోటీకి నిలవటం ఇప్పుడు సంచలనంగా మారింది. మూడేళ్ల క్రితం కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారి.. విజయన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమైన అక్కాచెల్లెళ్ల హత్యాచారం తాజా ఎన్నికల్లో చర్చకు రానున్న పరిస్థితి. ఎందుకంటే.. హతురాళ్ల తల్లి ఇప్పుడు ఏకంగా సీఎంపైనే పోటీ చేయాలని నిర్ణయించటమే దీనికి కారణం.

2017లో వలయార్ ప్రాంతంలో అక్కాచెల్లెళ్లైన ఇద్దరు బాలికలపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగి.. వారిని చంపేశారు. ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పును ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం కావటంతో కేరళ సర్కారు అప్పీలుకు వెళ్లింది.

ఈ ఉదంతంపై తమకు న్యాయం చేయాలంటూ హతురాళ్ల తల్లి సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నారు. రిపబ్లిక్ డే నాడు.. పాలక్కడ్ లో సత్యాగ్రహం దీక్ష చేయటమే కాదు.. గత నెల గుండు గీయించుకొని తన నిరసనను తెలియజేశారు. తమ కుటుంబ సభ్యులకు జరిగిన దారుణంపై ముఖ్యమంత్రి ఇప్పటివరకు మాట్లాడింది లేదని.. అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్లుగా ఆమె చెబుతున్నారు.
Read more!

సీఎంకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు ఇదే సరైన అవకాశంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. తన కుమార్తెలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అలెర్టు అయ్యింది. ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలోకి దించే కన్నా.. బాధితురాళ్ల తల్లికి మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. కేరళ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం అందరిని ఆకర్షిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News