‘అగస్టా’లో కీలక మలుపు... కమల్‌ నాథ్‌ కుమారుడు - మేనల్లుడు!

Update: 2020-11-18 11:30 GMT
అగస్టా వెస్ట్‌ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం కేసు గత కొన్ని రోజులుగా విచారణ దశలోనే ఉంది. ఈ కేసులో ఎంతోమంది కీలక వ్యక్తుల ప్రమేయం ఉండటంతో విచారణ వేగంగా ముందుకు సాగలేకపోతుంది. తాజాగా ఈ అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం కేసు లో దర్యాప్తునకు సహకరించడానికి ముందుకు వచ్చిన నిందితుడు రాజీవ్‌ సక్సేనా ఈడీ విచారణలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్ ‌నాథ్‌ కుమారుడు బకుల్‌ నాథ్‌, మేనల్లుడు రతుల్‌ పూరీ పేర్లను చెప్పాడు.

అలాగే , ఈ ఇద్దరితో పాటుగా కాంగ్రెస్‌ నేతలు సల్మాన్‌ ఖుర్షీద్‌, అహ్మద్‌ పటేల్‌ పేర్లను కూడా ఈడీ అధికారులకు ఆయన చెప్పారు. అయితే, ఆ నలుగురికి ఈ కుంభకోణంతో సంబంధం ఉందనడానికి సరైన ఆధారాలను మాత్రం రాజీవ్‌ సక్సేనా నుంచి ఈడీ రాబట్టలేకపోయింది.

ఇదే కేసులో ఇప్పటికే రతుపూరీపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. అగస్టా వెస్ట్‌ ల్యాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణానికి సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో కూడా రతుల్ పూరీ నిందితుడిగా ఉన్నారు.

అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాప్టర్‌ తయారీ కంపెనీ. వీవీఐపీల పర్యటన నిమిత్తం ఈ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లు ఏడబ్ల్యూ 101 కొనుగోలు చేయడానికి రూ.3,600కోట్లతో 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరేలా చేసేందుకు అగస్టా, ఇటలీలోని దాని మాతృసంస్థ సంయుక్తంగా మధ్యవర్తుల్ని రంగంలోకి దింపి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు ముడుపులు చెల్లించడానికి ప్రయత్నించిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు ముగ్గురు మధ్యవర్తులు భారత్‌ వైమానిక దళంతో సంప్రదింపులు జరిపారు. అందులో ఒకరు క్రిస్టీన్‌ మిషెల్‌. ఇందుకు గాను అగస్టా అతడికి రూ.225కోట్లు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో అప్పటి భారత వైమానిక దళ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి ప్రమేయం ఉందని వెల్లడైంది.
Tags:    

Similar News