9 ఏళ్లలో 28సార్లు జైలుకెళ్లిన ఘనుడు .. ఏం చేస్తుంటాడంటే ?

Update: 2021-05-20 00:30 GMT
చిన్నతనం లో కొన్ని తప్పుడు పనులు చేసి , జైలుకి వెళ్లేవారు ఎంతోమంది ఉంటారు. అయితే, జైలుకి వెళ్లిన తర్వాత వారిలో కొందరు తమ తప్పు తెలుసుకొని బయటకి వస్తారు. కానీ, మరికొందరు మాత్రం బయటకి వచ్చినా కూడా మల్లి తప్పుడు పనులు చేస్తూ మళ్లీ మళ్లీ జైలుకి వెళ్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం నేరాలనే జీవితంగా ఎంచుకున్నాడు. నేరం చేయనిదే మనోడికి చేతులు ఖాళీగా ఉండవు. 16 ఏళ్ల వయసులోనే జైలు కెళ్లినవాడు, ఆ తర్వాత మారలేదు. రికార్డు స్థాయిలో దొంగతనాలు చేస్తున్నాడు. అతడి వయసు 25 ఏళ్లు , ఇప్పటికే అతడు ఏకంగా 28సార్లు జైలుకెళ్లాడు. జైలుకెళ్లడం, తిరిగిరావడంఅతనికి ఓ అలవాటుగా మారిపోయింది. తాజాగా మరో దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏపీలోని నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబొట్లపల్లికి చెందిన గోగుల శివయ్య 16 ఏళ్ల వయసులోనే వ్యసనాలకు బానిసై , డబ్బుల కోసం ఓ షాపులో దొంగతనం చేసి దొరికిపోయాడు. దీనితో అతడ్ని తిరుపతిలోని జువైనల్ హోమ్ కు తరలించారు.అక్కడి నుంచి విడుదలైన తర్వాత కూడా అతడి ప్రవర్తన లో ఎటువంటి మార్పు రాలేదు. రాత్రుళ్లు బైక్ పై తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసిరాడు. ఇప్పటివరకు 28 చోరీ కేసుల్లో అరెస్టై జైలు జీవితం గడిపాడు. శివయ్యపై కలువాయి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఓపెన్ అయింది. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఈ క్రమంలో ఈనెల 17న రాత్రి రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దెలముడుగు జంక్షన్ వద్ద శివయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 11 లక్షలు విలువ చేసే 30సవర్ల బంగారు ఆభరణాలు, రూ.40వేలు నగదు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. శివయ్య నుంచి రాపూరు, చేజర్ల, మునుబోలు, సంగం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించిన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఘరానా దొంగను అరెస్ట్ చేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 16ఏళ్ల వయసు నుంచే వ్యసనాలు, విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన శివయ్య.. కేవలం 9 ఏళ్ల కాలంలో ఏకంగా 28సార్లు జైలుకెళ్లాడని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.


Tags:    

Similar News