80 ఏళ్ల ఉద్య‌మం ఏం నేర్పుతోంది ?

Update: 2022-08-08 05:51 GMT
క్విట్ ఇండియా ఉద్య‌మానికి 80 ఏళ్లు.  భార‌త దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు. ఇవాళ ఓ ప్ర‌త్యేక‌మ‌యిన సంద‌ర్భంలో మ‌నం ఉన్నాం అని గ‌ర్వించాలి.  దాని వెనుక ఉన్న నేప‌థ్యాన్నిఅర్థం చేసుకుని గర్వపడాలి. ఇవే ఇప్పుడు కీల‌కం. తెల్ల‌దొర‌ల ఆగ‌డాలు భ‌రించలేక క్విట్ ఇండియా అన్న ఉద్య‌మం తో విజ‌య దుందుభి మోగించిన సంద‌ర్భాన గాంధీ ఎలా ఉన్నారు.

ఆ వేళ ఆయ‌న భావం ఏంటి ? మ‌రో సందేహం ఏంటంటే భార‌తీయుల‌లో కొన్ని స‌మూహాలంతా ఇప్ప‌టిలానే అప్పుడు కూడా నిర్లిప్త‌త‌లోనే ఉన్నాయా లేదా క‌దిలాయా ? ఇటువంటి సందేహాలు కూడా అప్పుడ‌ప్ప‌డూ వెన్నాడుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడా ! నిన్న‌టి వేళ ర‌వీంద్రుని వ‌ర్ధంతి.

ఆయ‌న చెప్పిన‌ విధంగా భ‌యం లేని స‌మాజం వైపు నా దేశాన్ని న‌డిపించు అని అన్నారు క‌దా !  మ‌న‌దేశాన నిర్భ‌యంగా బతకగలిగిన పరిస్థితులు ఉన్నాయా..అంటే టక్కున సమాధానం చెప్పలేం.  బేల‌త‌నం, బెరుకుత‌నం, కొందరిలో క‌ర‌కు త‌నం... ఇది వాస్తవ భారతం. మన పోరాట యోధుల నుంచి మనం ఏమీ నేర్చుకోలేదు.  వారి స్ఫూర్తి మ‌న ద‌గ్గ‌ర ఉంది. ఆచ‌ర‌ణ లేదు అన్న‌దే నాయ‌కుల విష‌య‌మై పౌరుల ఆవేద‌న, బాధ్య‌త లేని పౌరుల విష‌య‌మై బిడ్డ‌ల విష‌య‌మై భ‌ర‌త‌మాత ఆవేద‌న.

లోక‌మాన్య బాల‌గంగాధ‌ర్ తిల‌క్, గోపాల కృష్ణ గోఖ‌లే వంటి నాయ‌కుల పిలుపు మేరకు అప్ప‌టిదాకా ఓ పాతికేళ్ల పాటు వివిధ ఉద్య‌మాలు చేసిన గాంధీ త‌న త‌ర‌ఫు మ‌రోగొంతుక వినిపించేందుకు, బ్రిటిష‌ర్ల ఆగ‌డాల‌ను అడ్డుకునేందుకు నిన‌దించిన నినాదం క్విట్ ఇండియా. నినాదం గొప్ప‌ది. అది పెద‌వుల‌ది కాదు హృద‌యానికి చెందింది అని క‌వి కాళోజీ అంటారే ! అంత గొప్ప‌ది.  ఆ నినాద స్ఫూర్తితో ఆ రోజు ఉద్య‌మం న‌డిచింది. భార‌తీయులకు స్వేచ్ఛ ఓ త‌క్ష‌ణ అవ‌స‌రం అయిన‌ప్పుడు ఉద్య‌మం పెల్లుబికింది.

కానీ ఇప్పుడు స్వేచ్ఛ  విశృంఖలం అయి ఉంది. క‌నుక ఫ‌లితాలు విభిన్నంగా ఉన్నాయి. క‌నుక నినాదాల నుంచి ఉద్య‌మాల వ‌ర‌కూ నేర్చుకోవాల్సినంత భార‌తీయ స‌మాజం నేర్చుకోలేద‌న్న‌ది ఓ వాస్త‌వం. ఇది ఇప్ప‌టి దాకా ఉన్న సంగ్ర‌హ స‌త్యం. దీనిని కాద‌నుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉండ‌లేరు. దీనిని వ‌ద్ద‌నుకుని ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రీ ఉండ‌లేరు.

స్ఫూర్తి మాటల్లో ఉండే ఉంటే ఉద్య‌మం న‌డ‌వ‌దు. అందుకు ఆచ‌ర‌ణ ఒక్క‌టే ప్ర‌ధాన సూత్రం. ప్రాథ‌మిక సూత్రం అని రాయాలి. అటువంటి ల‌క్ష్యాలిప్పుడు నెర‌వేర‌డం లేదు. అందుక‌నే ఎన‌భై ఏళ్ల క్విట్ ఇండియా నినాదాన్ని రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌రో విధంగా ఉప‌యోగ‌ప‌డడం విచార‌క‌రం. క్విట్ మోడీ అని ఒక‌రు, క్విట్ కాంగ్రెస్ అని ఒక‌రు ఈ విధంగా ఎవ‌రికి వారు భాష్యం చెప్పుకునే విధంగా ఆ నినాదం మారిపోవ‌డమే బాధాకరం. ప‌విత్ర భార‌త‌మా మేలుకో !
Tags:    

Similar News