అదిగో పెద్ద పులి....మళ్ళీ జనంలోకి
ఆ తరువాత అదే పెద్ద పులి కాస్తా ఏకంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వైపుగా ప్రయాణించి అక్కడి ప్రజలను హడలెత్తించింది. దాంతో సాయంత్రం అయితే చాలు ఎవరూ గుమ్మం కదిలే పరిస్థితి లేకుండా పోయింది.;
పెద్ద పులి కధ సుఖాంతం అయింది అని అంతా అనుకున్నారు. గోదావరి జిల్లాల ప్రజలను గత నెల రోజులుగా వేధించుకుని తిన్న పెద్ద పులి కధ అందరికీ తెలిసిందే ఈ పెద్ద పులి తన ఉనికిని తొలిసారిగా ఏలూరు జిల్లా బుట్టాయగూడెం ప్రదేశం నుంచి చాటుకుంది. అక్కడ పెద్ద పులి అడుగు జాడలు కనిపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ తరువాత అదే పెద్ద పులి కాస్తా ఏకంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వైపుగా ప్రయాణించి అక్కడి ప్రజలను హడలెత్తించింది. దాంతో సాయంత్రం అయితే చాలు ఎవరూ గుమ్మం కదిలే పరిస్థితి లేకుండా పోయింది.
ఎట్టకేలకు పట్టుకున్నా :
ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పెద్ద పులిని మత్తు ఇంజెక్షన్ ద్వారా పట్టుకోగలిగారు. అదంతా అనపర్తి వద్ద జరిగింది. దానిని జాగ్రత్తగా తెచ్చి విశాఖలోని జూలో కొన్నాళ్ళ పాటు ఉంచారు. అలా వారం రోజుల పాటు పెద్ద పులికి అక్కడ అంతా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి పెద్ద పులి మత్తు వదిలి తమ స్వాధీనంలోకి వచ్చాక దానికి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సిగ్నల్ టాకింగ్ అమర్చి అడవిలో వదిలారు. దానిని మొదట నల్లమల అడవులలో వదిలేయాలని అనుకున్నా ఎక్కువ సఖ్యలో మగ పులులు ఉంటాయి అని అటవీ శాఖ అధికారులు భావించారు. ఆ మగ పులుల మధ్య గొడవలు వస్తాయని భావించి పాపి కొండల వద్ద అటవీ ప్రాంతంలో వదిలారు. అయితే ఇలా వదిలేశారో లేదో అలా వారం రోజుల తేడాతో పెద్ద పులి తిరిగి ప్రత్యక్షం అయింది. ఈ సారి ఈ పెద్ద పులి రంప చోడవరం ప్రాంతంలో అడుగు పెట్టినట్లుగా దానికి అమర్చిన సిగ్నల్ టాకింగ్ వ్యవస్థ ద్వారా అధికారులు గుర్తించారు. దాంతో పెద్ద పులి మళ్లీ వచ్చింది అని సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు ఇపుడు ఫుల్ అలెర్ట్ చేస్తున్నారు.
పెద్ద పులి ఉంది అంటూ :
ఇదిలా ఉంటే రంపచోడవరం పరిసర అడవి ప్రాంతాలలోని పెద్దపులి సంచారంపై ఎక్కడికి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వారం క్రితం పాపికొండల నేషనల్ పార్కులో మగ పెద్దపులి వదలడం జరిగిందని వారు తెలిపారు. నల్లమల అడవులలో మగ పులులు ఎక్కువగా ఉండటం వలన కొట్లాడుకునే అవకాశం ఉన్నందున మగ పులిని నేషనల్ పార్క్ లో వదలడం జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే అది ఇపుడు మళ్ళీ జనంలోకి వస్తోంది అని అంటున్నారు.
ఒంటరిగా వద్దు :
ఈ క్రమంలో రంప చోడవరం ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ఎవరైనా ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత ఒంటరిగా ఎవరు బయట తిరగవద్దని అదేవిధంగా చిన్నపిల్లలను రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపవద్దని అధికారులు గట్టిగా కోరుతున్నారు. ఎక్కడైనా ఆవులు మేకలు పులి బారిన పడితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించే విధంగా తగిన చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. ఇక ఈ పెద్దపులికి జియో టాకింగ్ సిస్టం అమర్చడం జరిగిందని అందువల్ల దాని కదలికలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు.
భయంతో వణుకుతున్నారు :
ఈ క్రమంలో స్థానిక ప్రాంత ప్రజలు పులి బారిన పడకుండా 24క్ష్7 ఎప్పటికప్పుడు పరివేక్షించడం జరుగుతుందని అధికారులు అయితే భరోసా ఇస్తున్నారు. అందువల్ల పెద్ద పులి సంచారం తగ్గేవరకు వివిధ గ్రామాలలోని ప్రజల అప్రమత్తంగా ఉండే విధంగా ఫారెస్ట్ సిబ్బందితో ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద పెద్ద పులి మళ్ళీ వచ్చేసింది. ఈ వార్తలో రంప చోడవరం ప్రజలు అయితే భయంతోనే వణుకుతున్నారు.