వావ్.. నాలుగేళ్లు బుడ్డోడు అండర్-12 జట్టులో

Update: 2016-07-24 04:39 GMT
ఆ మధ్య యూట్యూబ్లో ఓ బుడతడి క్రికెట్ విన్యాసాలు సంచలనం రేపాయి చూశారా..? బ్యాట్ అంత పొడవు కూడా లేని పిల్లోడు.. అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ బుడ్డోడి స్టాన్స్ కానీ.. అతడు షాట్లు ఆడిన తీరు కానీ చూసి అందరికీ దిమ్మదిరిగింది. ఈ వీడియో వాట్సాప్ లో కూడా హల్ చల్ చేసింది. ఇప్పుడు ఇలాంటి వండర్ కిడ్ మరొకడు వచ్చాడు. నాలుగేళ్ల వయసులోనే తన క్రికెటింగ్ స్కిల్స్ చాటుకుని ఏకంగా అండర్-12 జట్టులోకే ఎంపికై సంచలనం సృష్టించాడతను. ఆ పిల్లాడి పేరు షయాన్ జమాల్. ఉండేది ఢిల్లీలో. కేవలం నాలుగేళ్ల వయసుకే అతడిని తమతో చేర్చుకుని అతడి స్కూల్ టీం. అది అండర్-12 జట్టు కావడం విశేషం.

అండర్-12 అంటే ఒకటి రెండేళ్లు తక్కువున్నా ఓకే. కానీ వయసు విభాగానికి ఏకంగా ఎనిమిదేళ్లు తక్కువన్నవాడికి.. అసలు లోకమే తెలియని వయసులో ఉన్న బుడ్డోడికి ఇందులో చోటు దక్కడం విశేషం. మూడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన జమాల్.. ఏడాది వ్యవధిలోనే క్రికెట్లో ఆరితేరిపోయాడు. పెద్ద వయసు పిల్లలు ఆడినట్లే చక్కగా బ్యాటింగ్ చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు జమాల్. ఏదో తమాషాకు అండర్-12 జట్టులో చోటివ్వలేదు అతడికి. జట్టులోని మిగతా వాళ్లలాగే అతనూ బ్యాటింగ్ చేస్తాడు. ఫీల్డింగూ చేస్తాడు. ఏదో ఒక రోజు భారత జట్టుకు ఆడతానంటూ పెద్ద స్టేట్ మెంట్లే ఇస్తున్నాడు జమాల్. తనకు కోహ్లి అంటే ఇష్టమని.. తనకు అతను స్ఫూర్తి అని కూడా చెబుతున్నాడు. మాజీ క్లబ్ క్రికెటరైన తండ్రి అర్షాద్ పర్యవేక్షణలో షయాన్ శిక్షణ తీసుకుంటున్నాడు.
Tags:    

Similar News